Modi in Hyderabad:తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం యువత బలిదానాలు చేశారని.. ఒక కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, పాలన అవినీతిమయంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద శత్రువులని, వాటిని పారదోలితేనే అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక్కడ భాజపా అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయ ఆవరణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఉన్నత శిఖరాలవైపు తీసుకెళ్లడానికి భాజపా ఎంతవరకైనా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ‘తెలంగాణ ఉద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఇక్కడ భాజపా కార్యకర్తలు ఎన్నో సవాళ్లు, వేధింపులు, దాడుల్ని ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. ఇక్కడ పోరాటం అధికారం కోసం కాదు. యువతను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రాభివృద్ధిని సాధించడం లక్ష్యం’ అన్నారు.
అవినీతిమయం చేశారు...కుటుంబ పాలనలో రాష్ట్రం బందీ అయ్యింది. ఇక్కడి ప్రభుత్వం సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తోంది. పాలనను అవినీతిమయం చేశారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. కుటుంబ పార్టీలు తమ సొంత ఖజానాను నింపుకోవడంపైనే దృష్టి పెడతాయి. రాష్ట్రంలో భాజపా చేస్తున్న సంఘర్షణ రోజురోజుకు రాటుదేలుతోంది. ఇక్కడ 2023లో భాజపా అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టమవుతోంది. తెలంగాణకు పురోగామి, నిజాయితీ గల ప్రభుత్వం అవసరం. అలాంటి ప్రభుత్వాన్ని భాజపా మాత్రమే ఇవ్వగలుగుతుంది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి రాజకీయాలు చేస్తోంది.
అభివృద్ధికి అడ్డంకిగా మూఢ విశ్వాసాలు..మూఢనమ్మకాలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకి. గుజరాత్‌లో నేను సీఎంగా ఉన్నప్పుడు కొన్ని నగరాలకు వెళితే అధికారం పోతుందన్న ప్రచారం ఉండేది. నేను ఆ ప్రదేశాలకు పదేపదే వెళ్లి వచ్చాను. యూపీలో ఒకచోటుకు వెళితే ఓడిపోతావని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కొందరు చెబితే ఆయన పట్టించుకోకుండా అక్కడికే వెళ్లి గెలిచారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులు నా దృష్టికి వచ్చాయి. పార్టీ కోసం ముగ్గురు కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారు.
తెలుగులో ప్రసంగం ప్రారంభం..దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ‘పట్టుదల, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మధ్యాహ్నం 1.04 గంటల నుంచి 1.30 వరకు ప్రధాని ప్రసంగించారు. వేదికపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు మురళీధర్‌రావు, లక్ష్మణ్, సోయం బాపురావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ప్రదీప్‌కుమార్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్ ఉన్నారు.