Etela Rajender Fires on KCR: తెలంగాణ వ్యవసాయం రంగం దేశంలోనే అత్యంత గందరగోళ పరిస్థితిలో ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. భాజపా మీద కోపాన్ని కేసీఆర్ రైతుల మీద చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ కొత్తగా వచ్చింది కాదని... దశాబ్దాలుగా కొనసాగుతోందని ఈటల అన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాక పంట పెరిగిందని చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ రెండు విధానాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం డీసీపీ పద్ధతిని ఎంచుకుని ధాన్యాన్ని ఇస్తుందని ఈటల తెలిపారు. వడ్లు, గన్ని సంచులు, సూతిల్ దారాలకు, హామీల కోసం కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని... రాష్ట్ర ప్రభుత్వం వరి సేకరణలో ఒక ఏజెన్సీల పని చేస్తుందని వివరించారు. ముందు చూపు లేక చిన్న చూపు చూడటం వల్లే సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పారు.
'కేంద్ర ప్రభుత్వం చేస్తోందనే ఫీజు రీయవంబర్స్మెంట్, దళిత బంధు, ఫించన్లు ఇస్తున్నారా? వడ్ల కొనుగోలు, రైతులకు ఇచ్చే ప్రతి సొమ్ము ప్రజల పన్నుల ద్వారా వచ్చినవే. వడ్లు పండించి పార్టీ కార్యాలయం, ఇళ్ల ముందు పోస్తామని కేసీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. పార్టీ ఆఫీసుల మీద దాడులు, ధర్నాలు చేస్తారా? ' - ఈటల రాజేందర్