Mission Bhagiratha Scheme Awarded: రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని నల్లాలద్వారా అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జాతీయ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి రాష్ట్రప్రభుత్వానికి సమాచారం పంపారు. గాంధీజయంతి రోజున దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆ అవార్డు అందిస్తారు.
మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల పరిశీలించిన కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది. మిషన్ భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించిన జల్‌జీవన్ మిషన్, మిషన్ భగీరథతో ఇంటింటికీ నాణ్యమైన తాగునీరు ఒక్కొక్కరికి 100 లీటర్లు చొప్పున అందుతున్నట్టు గుర్తించింది.