తెలంగాణ

telangana

ETV Bharat / city

నిన్న లైవ్​లో ఉరి.. నేడు వాగులో దూకి.. మాజీ మిస్​ తెలంగాణకు ఏమైందీ..? - ఉరి

హైదరాబాద్​లో నిన్న ఇన్​స్టా లైవ్​లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మాజీ మిస్​ తెలంగాణ భవాని(miss telangana 2018: ).. ఈరోజు మళ్లీ వాగులో దూకి బలవన్మరణానికి పూనుకుంది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి హాని జరగకుండా.. ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. అసలు ఆమె ఇలా.. వరుసగా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందంటే..

miss-telangana-woman-attempted-suicide-by-jumping-in-munneru
miss-telangana-woman-attempted-suicide-by-jumping-in-munneru

By

Published : Oct 29, 2021, 8:41 PM IST

Updated : Oct 29, 2021, 9:03 PM IST

నిన్న లైవ్​లో ఉరి.. నేడు వాగులో దూకి.. మాజీ మిస్​ తెలంగాణకు ఏమైందీ..?

జీవితంపై విరక్తితో హైదరాబాద్​లో నిన్న ఉరేసుకుని ఆత్మహత్యకుయత్నించిన మాజీ మిస్​ తెలంగాణ మోడల్​ భవాని అలియాస్ హాసిని(miss telangana 2018 hasini) మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జిపైనుంచి మున్నేరు వాగులో దూకింది. స్థానికులు వెంటనే మున్నేరులో దూకి ఆమెను కాపాడారు. ప్రస్తుతం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

లైవ్​లో ఉరేసుకుంటూ..

ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని(21) హైదరాబాద్ లో మోడలింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది. నగరంలోని హిమాయత్​నగర్​లో ఓ అపార్ట్​మెంట్​లో ఒంటరిగా ఉంటోంది. 2018 లో నిర్వహించిన "మిస్ తెలంగాణ" పోటీల్లో ఆమె మిస్ తెలంగాణగా గెలిచింది. కాగా.. నిన్న రాత్రి హైదరాబాద్​లోని తన అపార్ట్​మెంట్​లో ఫ్యాన్​కు ఉరేసుకుంటూ ఇన్​స్టాగ్రామ్​లో లైవ్​ వీడియో పెట్టింది. దాన్ని చూసిన స్నేహితులు పోలీసులకు కాల్​ చేశారు. పోలీసులు హుటాహుటిన వచ్చి ఆమెను కాపాడి వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. పరిస్థితి కుదుట పడ్డాక.. కాసేపటికి కుటుంబసభ్యులు తమ వెంట తీసుకెళ్లారు.

తర్వాతి రోజే వాగులో దూకి..

నగరంలో ఒంటరిగా ఉంటే.. తన మానసిక పరిస్థితి కుంగిపోతుందని.. తమ వెంట తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాత్రికి రాత్రే ఆమెను హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన బుధవాడకు బంధువులు తీసుకెళ్లారు. అయితే.. అక్కడికి వెళ్లినా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల నుంచి హాసిని బయటకు రాలేకపోయింది. చావు నుంచి బయటపడిన ఒక్కరోజులోనే మళ్లీ బలవన్మరణానికి ప్రయత్నించింది. తన గ్రామం నుంచి స్కూటీపై వచ్చిన హాసిని.. కీసర బ్రిడ్జిపై బండిని పెట్టింది. ఒక్కసారిగా.. బ్రిడ్జిపై నుంచి మున్నేరు వాగులోకి దూకేసింది. ఆమె దూకటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాపాడారు. ఈ ఘటనపై కంచికచెర్ల పోలీసులు విచారణ చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించి.. ఈ యువతి ప్రాణాలతో బయటపడింది.

కారణం ఏమై ఉంటుంది..?

2018లో మిస్​ తెలంగాణగా ఎంపికైన హాసిని వరుసగా రెండు సార్లు.. ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించిందనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే.. హాసిని కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే.. యువతి ఆత్మహత్యకు యత్నించినట్టు అంచనా వేస్తున్నారు. అయితే.. మరోవైపు హాసిని ఇటీవలే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఓ ఫిర్యాదు చేసింది. ఓ యువకుడు తనను శారీరకంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మరి, ఆమె ఆత్మహత్యకు యత్నించడానికి ఈ రెండింట్లో ఏది అసలైన కారణమనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.

సంబంధిత కథనం..

Last Updated : Oct 29, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details