'రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి' రాష్ట్రంలో పెద్ద ఎత్తున వస్తున్న పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. అటువంటి కంపెనీల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి అభివృద్ధి కేంద్రంలో అధికారులతో సమావేశమైన కేటీఆర్... పరిశ్రమలు, ఐటీ శాఖలపై సమీక్ష నిర్వహించారు.
అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి
రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సిద్ధమవుతోన్న పారిశ్రామిక పార్కులు, ఇతర మౌలిక వసతుల కల్పన, సంబంధిత కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బుగ్గంపాడు, బండమైలారం, బండతిమ్మాపూర్ వంటి పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న కంపెనీల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పలు కంపెనీలు త్వరలోనే రాష్ట్రంలో పెట్టుబడులపైన అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. టెక్స్ టైల్ రంగంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించిన కేటీఆర్... వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు పట్ల మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. అక్కడ అవసరమైన మౌలిక వసతులు వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులకు స్పష్టం చేశారు.
జులైలో అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్
ఐటీ శాఖ కార్యకలాపాలను సమీక్షించిన మంత్రి... టీహబ్ రెండో దశ భవనం త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. జులైలో అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... ఆ మేరకు పార్కుల అభివృద్ధి, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, ఇప్పటికే వరంగల్ నగరానికి పలు ప్రముఖ కంపెనీలు తమ కార్యాకలాపాలు విస్తరించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇంకా అనేక కంపెనీలూ సుముఖంగా ఉన్నాయని చెప్పారు.
కరీంనగర్ ఐటీ టవర్ 18న ప్రారంభం
కరీంనగర్లో నిర్మించిన ఐటీ టవర్ను ఈ నెల 18న ప్రారంభిస్తున్నామని, అక్కడా పలు కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం పట్టణాల్లోనూ ఐటీ భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. అక్కడ కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన కంపెనీలతో మాట్లాడి భవనాలు సిద్ధం కాగానే ఉద్యోగ కల్పన జరిగేలా చూడాలని ఐటీశాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇదీ చూడండి:తుపాకులగూడెం ఆనకట్టకు సమ్మక్క పేరు