TRS formation day meeting: తెరాస ఆవిర్భావ సభను ఏప్రిల్ 27న మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించేందుకు అధిష్ఠానం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సమీక్షించారు. ఎమ్మెల్యే గోపినాథ్‌తో కలిసి హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో సభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్.. పలు సూచనలు చేశారు. ఆవిర్భావ వేడుకకు 3000 మంది ప్రతినిధులు హాజరవనున్నారని తెలిపారు. కేవలం ఆహ్వానం అందినవారే సభకు రావాలని సూచించిన కేటీఆర్.. పాసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
"తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించింది. 21 ఏళ్ల తెరాస.. బాల్యదశ నుంచి మేజర్‌గా మారింది. 21వ ఆవిర్భావ వేడుకకు హెచ్ఐసీసీ వేదికను ఫైనల్ చేశాం. తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగలా జరుపుకుంటారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం. 21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. రేపు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ నాయకులతో సమావేశం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు వార్షికోత్సవంలో ఉంటాయి. ఆహ్వానాలు అందిన వారే ఆవిర్భావ సభకు రావాలి. సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుంది. 12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలి. 3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి." - కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు