ఎక్కడ ఉండాలో తెలియదు. ఎక్కడ పని దొరుకుతుందో అర్థం కాదు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలి తీర్చే వాళ్లు రాక.. కంటి నిండా కునుకు కరువై... బతుకీడుస్తున్నారు కార్మికులు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రెండో దశ దిగ్బంధం కొనసాగుతోంది. మొదటి 21 రోజులే వలస కార్మికులకు దినదినగండంగా గడిచాయనుకుంటే.. ఇప్పుడు మరో 19 రోజులు పొడిగించటం వారి కష్టాలను రెట్టింపు చేసింది.
పిల్లల్ని ఎత్తుకుని వేల మైళ్లు నడిచి
ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ స్తబ్ధత నెలకొంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వ్యాపారాలూ ఆగిపోయాయి. ఫలితంగా వీటిపైనే ఆధారపడి ఉపాధి పొందుతున్న వలస కార్మికులకు పని లేకుండా పోయింది. రోజు గడవని దుస్థితిలో ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజారవాణా నిలిచి పోయినందున... చంటి పిల్లలనెత్తుకుని... వేల మైళ్లు నడిచి సొంత గూటికి చేరుకునే క్రమంలో నరకయాతన అనుభవిస్తున్నారు.
5 లక్షల మంది పల్లెలకు..
ఉపాధి కోసం పట్నం వచ్చినా... ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా మళ్లీ ఇంటికి వెళ్లాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వలస కార్మికులు ఒక చోట నుంచి మరో చోటుకు వస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని వీరెవరూ సరిహద్దులు దాటకుండా కాపు కాస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 5 లక్షల మంది వలస కార్మికులు పట్టణాలు వీడి పల్లె బాట పడుతున్నట్లు అంచనా. సుమారు 20 మంది మార్గ మధ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు చూసి అధికార యంత్రాంగమూ ఏమీ చేయలేకపోతోంది. లాక్‌డౌన్ ప్రకటించే ముందు... వీరిని దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు చేసి ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది.
పోవడానికి అనుమతివ్వాలని వేడుకోలు
ఇలా సొంతూళ్లకు పయనమవుతున్న వారిని అడ్డుకుని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తున్నారు పోలీసులు. ఫలితంగా కొందరు కార్మికులు అక్కడ ఉండలేక పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా బతుకుతున్న తమను సొంతూరికి పోయేందుకు అనుమతినివ్వాలని వారు వేడుకుంటున్నారు. కానీ... వైరస్ వ్యాప్తి దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు వారిని ఎటూ కదలనివ్వటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు... స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకొచ్చి వలస కార్మికులకు చేయూతనందించాలని పిలుపునిస్తున్నాయి. వ్యక్తిగతంగా కూడా కొందరు వీరికి ఆహార పొట్లాలు అందించి ఆకలి తీర్చుతున్నారు.
గ్రామస్థుల్లో ఆందోళన
పంట చేతికొచ్చే సమయానికి కూలీలెవరూ పనికి రాకపోవటం వల్ల అటు రైతులూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రజారవాణా లేనందున... ఎక్కడి పంటలు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికైతే... పట్టణాల కంటే గ్రామాలే సురక్షితమని భావించి ఈ కార్మికులంతా పల్లెటూళ్లకు పయనమవుతున్నారు. కానీ... ఆయా గ్రామ ప్రజలు కూడా కార్మికుల రాకపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా వస్తే తమ ప్రాంతంలోనూ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని భయపడుతున్నారు. ఫలితంగా.. ఇటు పట్నంలో ఉండలేక.. అటూ ఇంటికీ పోలేక మధ్యలో నలిగి పోతున్నారు వలస కార్మికులు.
వారిలో ఒంటరి అనే భావన
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ సరైన నిర్ణయమే అయినా సామాజిక, ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్న వారికి మాత్రం ఇది కష్టకాలమే. వీరిని మరింత ఆందోళనకు గురి చేస్తున్న మరో అంశం... కొన్ని చోట్ల క్వారంటైన్ గడువును పొడిగిస్తుండటం. ఇలా సమస్య మీద సమస్య వారిని వెంటాడుతూ తాము ఒంటరిగా మిగిలిపోయామన్న భావన కలిగిస్తున్నాయి. వలస కార్మికుల సమస్యలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలన్నీ తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే... వీరి వెతలు తీర్చటం ఎవరి సాధ్యమూ కాదు.
ఇదీ చూడండి:రోడ్డెక్కితే 4 గంటలు అక్కడ కూర్చోవాల్సిందే!