Mekapati Goutham reddy Cremations: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని కడసారి చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి భౌతికకాయాన్ని నెల్లూరులోని పోలీసు కవాతు మైదానానికి మంగళవారం ఉదయం తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో డైకస్ మార్గంలోని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం క్యాంపు కార్యాలయంలో ఉంచారు. జిల్లాలోని అభిమానులు, కార్యకర్తలు వేలల్లో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజరి, సోదరులు పృథ్వీరెడ్డి, విక్రమ్‌రెడ్డి, భార్య కీర్తి, కుమార్తె సాయి అనన్యరెడ్డిని పరామర్శించారు. తొలుత కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు జాతీయ పతాకాన్ని పార్థివదేహంపై కప్పి.. పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా మంత్రులు అనిల్‌కుమార్, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు అమెరికా నుంచి రాత్రి 11 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడి పార్థివదేహాన్ని చూసి తల్లి మణిమంజరి కన్నీటి పర్యంతమయ్యారు. భౌతికకాయం ఉంచిన బాక్స్‌ను ముద్దాడుతూ.. విలపిస్తుంటే.. ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ప్రముఖుల నివాళి
గౌతమ్‌రెడ్డిని చివరిచూపు చూసేందుకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఏపీ మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరామ్, తానేటి వనిత, రంగనాథరాజు, ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, గల్లా జయదేవ్, మోపిదేవి వెంకటరమణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఆనం అరుణమ్మ, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులైన గౌతమ్ సవాంగ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.
అంతిమ యాత్ర ఇలా..
బుధవారం ఉదయం 6 గంటలకు నెల్లూరులోని మంత్రి నివాసం నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాల వరకు సాగుతుంది. 11 గంటలకు సీఎం జగన్ నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.