ప్రస్తుతం దిల్లీలో తన తల్లితో కలిసి ఉంటోంది ఐశ్వర్య. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా కరీంనగర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య దిల్లీలోని సంస్కృతి స్కూల్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కడే ‘శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్’ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది.
అలా మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను !
ఇక శోరాన్ తల్లికి మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ అంటే ఎంతో ఇష్టమట. అందుకే పుట్టగానే తన కూతురికి ఐశ్వర్య అనే పేరు కూడా పెట్టింది. ఐష్‌లాగే తన ముద్దుల కూతురిని ‘మిస్ ఇండియా’గా చూడాలనుకుంది. అందుకు తగ్గట్లే దిల్లీలో డిగ్రీ చదివే రోజుల్లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది ఐశ్వర్య. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా తెచ్చుకుంది.
‘అది 2014. అప్పుడు నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. ఒక రోజు అమ్మతో కలిసి ఒక షాపింగ్ మాల్‌కు వెళ్లాను. ఆ సమయంలో అక్కడ ‘దిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్’ ఈవెంట్ పోటీలు జరుగుతున్నాయి. సరదాగా నేనూ పేరిచ్చాను. అయితే చివరకు టైటిల్ నాకే దక్కింది. నా మోడలింగ్ కెరీర్‌కు అడుగు పడింది ఇక్కడే. ‘మిస్ ఇండియా’ కాంపిటీషన్స్‌లో పాల్గొనమని ఆ పోటీల నిర్వాహకులే నాకు సలహా ఇచ్చారు. ఆ తర్వాత దిల్లీ వేదికగా జరిగిన ‘దిల్లీ ఫినాలే ఆఫ్ ఫ్రెష్ ఫేస్’, ‘మిస్ క్యాంపస్ ప్రిన్సెస్ దిల్లీ’ కాంపిటీషన్స్‌లోనూ నేను విజయం సాధించాను. ఈ విజయాలు నాకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ అందాల తార.
నా చిరకాల స్వప్నం అదే !
ఇండియాలో జరిగే అందాల పోటీలకు సంబంధించి ‘ఫెమినా మిస్ ఇండియా’ కాంపిటీషన్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అలాంటి అందాల పోటీల్లో ఫైనల్స్ వరకు చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఐశ్వర్య. దురదృష్టవశాత్తూ త్రుటిలో టైటిల్ చేజార్చుకున్నా అందాల రాణిగా చూడాలనుకున్న తన తల్లి కలను నిజం చేసింది. ఇలా మోడలింగ్ రంగంలో మెరుపులు మెరిపించిన ఐశ్వర్య ఉన్నట్లుండి సివిల్ సర్వీసెస్ వైపు దృష్టి సారించింది. తండ్రి స్ఫూర్తితో ఐఏఎస్‌గా ప్రజలకు సేవలందించాలనుకుంది.
‘నా జీవితంలో ఇదొక పెద్ద మలుపు...
‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల తర్వాత నాకు మోడలింగ్‌లో మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయి. మనీష్ మల్హోత్రా లాంటి ప్రముఖ డిజైనర్లు, మ్యాగజైన్ల కోసం పనిచేశాను. ‘బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్’, ‘లాక్మే ఫ్యాషన్ వీక్’, ‘అమెజాన్ ఫ్యాషన్ వీక్’ లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో ర్యాంప్ వాక్ చేశాను. ఇలా ఈ గ్లామర్ ప్రపంచంలో నేను వూహించిన దాని కన్నా ఎక్కువగానే గుర్తింపు సొంతం చేసుకున్నాను. అదే సమయంలో సివిల్ సర్వీసెస్ సాధించాలన్న నా చిరకాల స్వప్నం నాకు గుర్తుకు వచ్చింది. దీంతో ఒకటి, రెండేళ్ల పాటు ఈ మోడలింగ్‌కు బ్రేక్ చెప్పేసి నా కలను నెరవేర్చుకోవాలనుకున్నాను’ అని అంటుందామె.
ముందు నుంచే చదువులో టాపర్‌ని !
ఐపీఎస్... ఐఏఎస్... ఐఎఫ్ఎస్.. ఐఆర్‌ఎస్... లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవడం అంత సులభమేమీ కాదు. ఎంతో పట్టుదల, తెలివితేటలతో పాటు కఠోరశ్రమ కూడా అవసరం. ఈ క్రమంలో ఎలాగైనా ఈ ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విజయం సాధించాలని చాలామంది కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. ఏళ్ల పాటు శిక్షణ తీసుకుంటూ మెరుగైన ర్యాంకు కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తుంటారు. అయితే మోడలింగ్‌ను పక్కన పెట్టి సివిల్స్ వైపు దృష్టి సారించిన ఐశ్వర్య ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఏళ్లకు ఏళ్లు సన్నద్ధమవ్వకుండా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది.
సోషల్ మీడియాకు దూరం... ఫోన్ కూడా బంద్
‘ముందు నా మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాను. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. కేవలం పరీక్షల మీదే దృష్టి సారించాను. మొదటి నుంచి నేను చదువులో చురుకే.. మా స్కూల్‌లో నేనే హెడ్ గర్ల్‌ని. ఇంటర్‌లో సైన్స్ గ్రూపు చదివి, డిగ్రీలో కామర్స్ గ్రూప్ తీసుకున్నాను. అలా మొదటి నుంచి చదువులో టాపర్‌గా ఉండడం వల్ల ప్రిపరేషన్‌పై శ్రద్ధ పెట్టడం నాకు పెద్ద కష్టమనిపించలేదు. ఆ ఫలితమే ఆలిండియాలో నాకు 93వ ర్యాంక్ వచ్చేలా చేసింది. ఇక మోడలింగ్ చేసిన అనుభవం కూడా నా ఇంటర్వ్యూకి చాలా హెల్ప్ అయింది. అదే ఇతర సివిల్స్ అభ్యర్థుల కన్నా నన్ను ముందు నిలబెట్టేలా చేసింది’ అని తన సివిల్స్ ప్రిపరేషన్ గురించి చెప్పుకొచ్చిందీ యంగ్ సెన్సేషన్.
నాన్నలా ఆర్మీలోకి వెళ్దామనుకున్నా కానీ !
అందాల పోటీల నుంచి ప్రజాసేవ వైపు మళ్లిన ఐశ్వర్య కొన్నిసార్లు నాన్నలా ఆర్మీలోకి వెళ్లాలనుకుందట. ‘నాన్న కల్నల్. ఆయనలా నేను కూడా ఆర్మీలోకి వెళదామని చాలాసార్లు అనుకున్నా. అయితే నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది కదా! అందుకే కొంచెం విభిన్నంగా ప్రయత్నిద్దామని సివిల్స్‌పై దృష్టి సారించాను. ప్రస్తుతం ఆర్మీలో ఎదగడానికి మహిళలకు చాలా అవకాశాలున్నాయి. కానీ అవి పరిమితం. అదే సివిల్ సర్వీసెస్‌లో అయితే చాలా అవకాశాలుంటాయి. ఏదైనా నా అంతిమ లక్ష్యం మాత్రం దేశానికి సేవ చేయడం’ అంటుంది ఐశ్వర్య.
మాకెంతో గర్వకారణంగా ఉంది !
దేశంలో అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది ఐశ్వర్య. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య సివిల్స్కు ఎంపిక కావడం తమకెంతో గర్వంగా ఉందని ‘ఫెమినా మిస్ ఇండియా’ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే పలువురు ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యకు అభినందనలు తెలుపుతున్నారు.
‘ఫ్యాషన్ నుంచి ప్రజా సేవ వైపు, నిజంగా ఇది ఎంతో గొప్ప ప్రయాణం’, ‘ఒకే వ్యక్తి విభిన్న రంగాల్లో రాణించేందుకు నువ్వు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చావు, నీకు స్వాగతం’, ‘అందం, తెలివితేటలు కలిస్తే ఐశ్వర్య శోరాన్’ అంటూ నెటిజన్లు కూడా ఆమెను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మరి ఫ్యాషన్ మెరుపుల నుంచి ప్రజాసేవ వైపు వెళుతున్న ఈ అందాల తారకు మనమూ అభినందనలు చెబుదాం!
ఇవీ చూడండి : కరోనా నెగిటివ్ వస్తేనే రానా పెళ్లి!