ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న జవానును అప్పగిస్తామని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట మంగళవారం వెలువడిన ప్రకటనలో పేర్కొన్నారు. మొన్నటి ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు. దాడిలో తాము స్వాధీనం చేసుకున్న ఆయుధాలతోపాటు మరణించిన మావోయిస్టుల చిత్రాలను విడుదల చేశారు. 3న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది జవాన్లు మృతి చెందారని తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌కు ముందే జీరగూడెం గ్రామంలో మడివి చుక్కాల్‌ను పోలీసులు పట్టుకొని హత్య చేసి ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఐజీ సుందర్‌రాజ్ నాయకత్వంలో 2,000 మంది పోలీస్ బలగాలు ఏప్రిల్ 3న దాడి కోసం వచ్చాయని తెలిపారు. రాయపూర్ కేంద్రంగా పనిచేస్తున్న విజయ్‌కుమార్ నాయకత్వంలో అక్టోబరులో 5 రాష్ట్రాల పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారని వివరించారు. కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వంలో 2020 ఆగస్టులో దిల్లీలో జరిగిన సమావేశంలో ‘ఆపరేషన్ ప్రహార్- ఆపరేషన్ సమాధాన్’ ప్రణాళిక రూపొందించారన్నారు. ఈ ప్రణాళిక అమల్లో భాగంగా 150మందికి పైగా గ్రామీణ ప్రజల్ని భద్రతా బలగాలు చంపాయన్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు కొందరు ప్రజలు ఉన్నారన్నారు. వేలాదిమందిని జైళ్లలో పెట్టారని, మహిళలను హింసించి హత్యచేశారని ఆరోపించారు.
ఓవైపు ఊచకోతను చేస్తూనే మరోవైపు పోలీస్ శిబిరాలను నిర్మించి రోడ్లు వేస్తూ ఇది ప్రజల అభివృద్ధి కోసమని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, రాజకీయ సంక్షోభం మరింత తీవ్రం అవుతోందన్నారు. ఫాసిస్టు ‘సమాధాన్- ప్రహార్’కు పీఎల్‌జీఏ ప్రతీకారం తీర్చుకుందని, వీటన్నింటికీ మోదీ, అమిత్‌షా బాధ్యత వహించాలని తన లేఖలో వికల్ప్ పేర్కొన్నారు.
పోలీసుల కుటుంబాలకు సానుభూతి..
‘పోలీసులు మాకు శత్రువులు కారు. పాలకవర్గాలు తెచ్చిపెట్టిన అన్యాయమైన యుద్ధంలో బలిపశువులు కావద్దని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. 2022లోగా మావోయిస్టు పార్టీని నిర్మూలించాలనేది మోదీ లక్ష్యం. అంబానీ, అదానీ వంటి సామ్రాజ్యవాద కంపెనీలకు ప్రభుత్వ సంస్థలను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వనరుల దోపిడీకి మావోయిస్టు పార్టీ ఆటంకంగా మారడంతో సైనిక దాడులు చేయిస్తున్నారు. ప్రజలను, వనరులను కాపాడటం కోసమే పీఎల్‌జీఏ ప్రతిదాడి చేయవలసివస్తోంది. ఈ ప్రతిదాడుల్లో పోలీసులు చనిపోవాల్సి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. అన్ని అధికారాలు ప్రజలకే అనే ‘జనతన’ సర్కార్ల ఏర్పాటే ప్రత్యామ్నాయం’ అని పేర్కొన్నారు.