Amazon Product : ఆన్‌లైన్‌లో ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు రావడం.. షూస్ కొనుగోలు చేస్తే సబ్బు పెట్టెలు రావడం గురించి మనం చాలా చూశాం. ఇలాంటి ఘటనల నుంచే వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే.. పార్శిల్ వచ్చిన తర్వాత దాన్ని తెరిచేటప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నారు. అందులో ఉంది తాము ఆర్డర్ చేసింది కాకపోతే ఆ వీడియో ప్రూఫ్ చూపించి ఫిర్యాదు చేయొచ్చనేది వారి ఆలోచన. ఇలాంటి ఘటనలు రోజూ చాలా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
కస్టమర్‌కు అమెజాన్ ఝలక్.. మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే.. - అమెజాన్ ఝలక్
Amazon Product : కష్టపడి సంపాదంచిన సొమ్ముతో మంచి మ్యాక్‌బుక్ కొనుక్కోవాలనుకున్నాడు. ఆఫర్‌లేమీ లేకపోయినా.. అవసరం కోసం లక్ష రూపాయలు ఖర్చు చేసి అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు. ఎట్టకేలకు అమెజాన్ పార్శిల్ వచ్చింది. రాగానే ఉత్సాహంగా పార్శిల్ ఓపెన్ చేశాడు. తీరా చూస్తే ఆ పార్శిల్‌లో మ్యాక్‌బుక్ బదులు కాగితాల కట్ట ఉంది. అది చూసి ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే..
కూకట్‌పల్లికి చెందిన యశ్వంత్ అనే యువకుడు ఇటీవల అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా మ్యాక్‌బుక్ కొనుగోలు చేశాడు. దానికోసం ఆన్‌లైన్ ద్వారా రూ.1,05,000 సొమ్ము కూడా చెల్లించాడు. మంగళవారం అతడికి అమెజాన్ నుంచి పార్శిల్ వచ్చింది. ఈ-కామర్స్ సైట్లలో ఒకటి బుక్ చేస్తే ఇంకోటి రావడం గురించి చాలా సార్లు విన్న ఆ యువకుడు.. అప్రమత్తమై పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేశాడు.
తాను అనుకున్నట్లుగానే పార్శిల్‌లో తాను ఆర్డర్ చేసిన మ్యాక్‌బుక్ రాకుండా.. కాగితాల కట్ట వచ్చింది. అది చూసి షాకైన యశ్వంత్ రికార్డు చేసిన ఆ వీడియోను జతచేసి ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని అమెజాన్ సీఈఓ, సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.