తెలంగాణ

telangana

ETV Bharat / city

శివరాత్రి పర్వదినాన సందర్శించాల్సిన శైవక్షేత్రాలు ఇవే..!

ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి... పంచభూతాలు... సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. లయకారుడైన పరమ శివుడు పంచభూత లింగ స్వరూపుడై కొలువైనవే పంచభూత క్షేత్రాలు. అందుకే ఆదిశంకరుణ్ణి భూతనాథుడనీ పిలుస్తారు. శివరాత్రినాడు విరూపాక్షుడి దేవాలయాల్లో విశిష్టమైనవిగా పేరొందిన ఈ పంచభూత స్థలాల్లో ఏ శివక్షేత్రాన్ని దర్శించినా జన్మధన్యంగా భావిస్తుంది భక్తకోటి.

lord shiva temples one should visit on shivaratri festival
lord shiva temples one should visit on shivaratri festival

By

Published : Mar 7, 2021, 11:38 AM IST

వాయులింగేశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా..!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో సువర్ణముఖీ నదీతీరంలో ఉందీ ఆలయం. ఇక్కడ శివుడు వాయులింగ ప్రతిష్ఠుడు. అందుకు నిదర్శనంగా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. స్వయంభువుగా వెలసిన స్వామివారి ఉచ్ఛ్వాస, నిశ్వాసల వల్లే అలా జరుగుతుందనీ, పరమేశ్వరుడే స్వయంగా ఇక్కడ కొలువుదీరాడనీ, అందుకే ఇది ప్రాణ లింగం అనీ చెబుతారు. ఈ కారణంతోనే శ్రీకాళహస్తిని కాశీకన్నా మహిమాన్వితమైన క్షేత్రంగానూ దక్షిణ కైలాసంగానూ భావిస్తారు. అంతేకాదు, అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కానీ ఇక్కడి లింగాన్ని మాత్రం పూజారులతో సహా ఎవరూ తాకరు. నవగ్రహ కవచంతో ఉండే ఈ మహా ప్రాణ లింగాన్ని నిత్యం పచ్చ కర్పూరంతో తాకకుండానే అభిషేకిస్తారట. తెల్లని వర్ణంలో ప్రకాశించే ఈ లింగాన్ని కర్పూర లింగం అనీ పిలుస్తారు. వర్తులాకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉండటం ఈ ప్రాణ వాయు లింగానికున్న మరో ప్రత్యేకత. ఇక్కడే కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడట. అతని భక్తిని పరీక్షించదలిచి- స్వామి కళ్ల నుంచి రక్తం కార్చగా కన్నప్ప తన కళ్లను తీసి పెట్టాడనీ, అంతట నీలకంఠుడు ప్రత్యక్షమై ముక్తిని ప్రసాదించిన కథా ప్రాచుర్యంలో ఉంది. పార్వతీదేవి పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ జ్ఞాన ప్రసూనాంబికా దేవిగా పేరొందిన ప్రదేశమూ ఇదే. ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తూర్పు ముఖంగానూ స్వామి వారు పశ్చిమాభిముఖంగానూ దర్శనం ఇస్తారు. ఈ దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్లు శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది.

జల లింగం... జంబుకేశ్వరం

తమిళనాడులోని తిరుచిరాపల్లికి 11 కి.మీ. దూరంలో ఉంది జంబుకేశ్వరాలయం. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి తిరువానైకావల్‌ అనే పేరు కూడా ఉంది. అంటే ఏనుగుల చేత పూజలందుకుంటున్న క్షేత్రం అని అర్థం. అయితే పూర్వం ఇక్కడ జంబు(నేరేడు) వృక్షాలు అధికంగా ఉండేవనీ అందుకే దీనికి జంబుకేశ్వరం అన్న పేరు వచ్చిందనీ చెబుతారు. దక్ష హింస వల్ల కలిగిన పాపాన్ని తొలగించుకోవడానికి శివుడు జంబుకేశ్వరంలో తపస్సు చేశాడనీ, భక్తుల కోరిక మేరకు అభిషేక ప్రియుడైన మహేశ్వరుడు జలరూపంలో వెలిశాడనీ అంటారు. మరో కథనం ప్రకారం- పరమ భక్తుడైన శంభుడు జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి నేరుగా పూజించాలన్న కోరికతో కఠోర తపస్సు చేస్తాడట. అతని భక్తికి మెచ్చి, శివుడు ప్రత్యక్షమై ‘నేను ఇక్కడే లింగరూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో నన్ను పూజిస్తావు అని వరమిస్తాడట. ఆలయ ప్రాంగణంలోని జంబువృక్షమే శంభుడుగా భావిస్తారు భక్తులు. జంబుకేశ్వరంలోని జలలింగం నీటితో నిర్మితమైనది అన్నదానికి గుర్తుగా ఇక్కడి శివలింగం పానపట్టంమీద ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. అది భక్తులకు అర్థమయ్యేందుకు ఆ పానపట్టంమీద ఓ వస్త్రాన్ని కప్పుతారు పూజారులు. కొంతసేపటికి దాన్ని తీసి పిండి దాన్నుంచి నీరు రావడాన్ని చూపిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం, ఈ ఆలయాన్ని క్రీ.శ.11వ శతాబ్దంలో చోళరాజులూ తరవాత పాండ్య, విజయనగర రాజులు నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడ స్వామివారి దేవేరి అఖిలాండేశ్వరీ దేవిగా చతుర్భుజాలతో దర్శనమిస్తారు.

ఆకాశలింగం... చిదంబర రహస్యం!

శంకరుడు ఆకాశ లింగ రూపంలో కొలువైన ప్రదేశమే చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో చెన్నైకి 231 కిలోమీటర్ల దూరంలో ఉందీ క్షేత్రం. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చోళులు, పాండ్యులు, పల్లవులు, విజయనగర రాజులు... ఇలా అనేకులు పునర్నిర్మిస్తూ వచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. మనిషిలోని నవ రంధ్రాల్ని సూచిస్తూ ఆలయానికి తొమ్మది ద్వారాలు ఉంటాయి. బంగారు పైకప్పు ఉన్న గర్భగుడిలో ఈశ్వరుడు స్వరూపం(నటరాజస్వామి), అర్ధ స్వరూపం(స్ఫటిక లింగ రూపం), నిరాకార స్వరూపం(శూన్య స్థలం)... ఇలా మూడు రూపాల్లో సాక్షాత్కరిస్తాడు. నటరాజస్వామి విగ్రహానికి కుడివైపున ఒక తెర ఉంటుంది. తెరని తొలగించినప్పుడు గోడమీద బంగారు బిల్వ పత్రాల వరసలు తప్ప మరేమీ కనిపించదు. ఖాళీగా ఉన్న ఆ గోడే ఆకాశానికి ప్రతీక. దాన్ని చూసినప్పుడు మనసులో కలిగిన భావనే దైవ దర్శనం అంటారు అర్చకులు. అంటే- ఈ గోడకి అడ్డుగా కట్టిన తెరకి బయటివైపు అజ్ఞానానికి చిహ్నమైన నలుపు రంగూ లోపలివైపు జ్ఞానానికి ప్రతీకైన ఎరుపు రంగూ ఉంటాయి. ఆ సమయంలో అజ్ఞానాన్ని తొలగించుకుని భగవంతుడికి పూర్తిగా లొంగి, ఆయనను మనలో లీనం చేసుకుని, ఆయన సమక్షాన్ని అనుభవించి జ్ఞానాన్ని పొందడం అన్నమాట. అది ఎవరికి వాళ్లు అనుభవించే స్థితే తప్ప కనిపించేది కాదు. అదే చిదంబర రహస్యంగా చెబుతారు. అందుకే రోజువారీ క్రతువులో ప్రధాన పూజారి శివోహం భవ అనుకుంటూ తెరని తొలగిస్తాడన్నమాట. శివాత్మ సర్వ వ్యాపితం అన్నదే ఈ ఆకాశ లింగం వెనకున్న పరమార్థం.

ఫృథ్వీ లింగం... కంచి

పంచభూతాల్లో ఒకటైన పృథ్విని సూచించేదే కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం. క్రీ.శ. 6వ శతాబ్దంలో చోళులూ పాండ్యులూ కట్టిన పురాతన ఆలయాల్లో ఇదీ ఒకటి. మామిడిచెట్టు కింద వెలవడం వల్లనే ఇక్కడ శివుణ్ని ఏకామ్రేశ్వరుడు(ఏక అంటే ఒకటి, ఆమ్ర అంటే మామిడి)అనీ అంటారు. ఈ చెట్టు మూడువేల ఐదు వందల సంవత్సరాలనాటిదట. దీనికి ఉన్న నాలుగు కొమ్మలు నాలుగు రుచుల మామిడి పళ్లు కాసేవనీ సంతానం లేని దంపతులు ఈ చెట్టుకింద రాలిన పండుని తింటే సంతానం కలుగుతుందనీ విశ్వసిస్తారు. అయితే ప్రస్తుతం నాటి చెట్టు కాండాన్ని మాత్రమే భక్తుల కోసం భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో దేవస్థానం వాళ్లు కొత్తగా మరో వృక్షాన్ని నాటారు. ఈ చెట్టుకింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే తపో కామాక్షినీ దర్శించవచ్చు. పౌరాణిక కథనం ప్రకారం- ఇక్కడ ఉన్న మామిడిచెట్టు కిందే పార్వతీదేవి తపస్సు చేసిందట. ఆమెను పరీక్షించదలచి శివుడు అగ్నిని పంపాడట. అప్పుడా ఉమాదేవి విష్ణుమూర్తిని ప్రార్థించగా- ఆయన పరమేశ్వరుడి తలమీద ఉన్న చంద్రుడి కిరణాలను ప్రసరింపచేసి చల్లార్చాడట. తరవాత శివుడు గంగను పంపగా- పార్వతీదేవి ‘నేను నీ సోదరిని కదా... నా తపస్సుకి అంతరాయం కలిగించవద్దు’ అని కోరడంతో గంగ వెనక్కి వెళ్లిపోయిందట. అప్పుడు హిమపుత్రి ఇసుకతో శివలింగాన్ని చేసి ఈ చెట్టుకింద ప్రతిష్ఠించి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుందట. పృథ్వీలింగం కావడంతో ఇక్కడి స్వామిని మల్లె నూనెతో అభిషేకిస్తారు. ఈ ఆలయం మండపంలో 1000 స్తంభాలూ 1008 శివలింగాలూ ఉంటాయి. 190 అడుగుల ఎత్తైన గోపురం ఉన్న ఈ ఆలయాన్ని 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటిగానూ పేర్కొంటారు.

తేజోలింగ నిలయం... అరుణాచలం!

అగ్ని భూతానికి ప్రతీకే అరుణాచలం. చెన్నైకి 185 కి.మీ. దూరంలో ఉందీ ప్రదేశం. ఇక్కడి స్వామి తేజోలింగ స్వరూపుడు. అందుకే దీన్ని అగ్ని క్షేత్రం అనీ అంటారు. జ్యోతిర్లింగాల్లో ఒకటిగానూ చెప్పే ఈ క్షేత్ర నామాన్ని స్మరించినా ముక్తి కలుగుతుందట. ఓసారి పార్వతీదేవి కైలాస ఉద్యానవనంలో విహరిస్తున్న శివుడి కళ్లను సరదాగా మూసిందట. వెంటనే జగమంతా చీకటిమయమైపోయిందట. అంతట పార్వతీదేవి శివభక్తులతో కలిసి క్షమించమని కైలాసనాథుణ్ణి కోరగా- ఆయన అణ్ణామలై మీద అగ్నిస్తంభ రూపంలో వెలవగానే కాంతి తిరిగివచ్చిందనేది పురాణ కథనం. అందుకే ఈ కొండ మొత్తాన్నీ శివలింగంగా భావిస్తారు. ఆపై ఆయన పార్వతిలో ఐక్యమై అర్ధనారీశ్వరుడయ్యాడట. అందుకే అరుణాచలాన్ని అర్ధనారీశ్వర రూపంగానూ చెబుతారు. బహ్మ, విష్ణువుల తగవును తీర్చేందుకు శివుడు అగ్నిలింగమై ఆవిర్భవించి దాని ఆద్యంతాలు కనుక్కోమని చెప్పాడనీ, ఆ అగ్నిరూపమే పర్వతంగా మారిందనీ అదే తిరువణ్ణామలైగా ప్రసిద్ధి పొందిందనీ అంటారు. వేదపురాణాల్లో పేర్కొన్న ఈ ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించాడనీ, దీని చుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందనీ, గౌతమ మహర్షి పూజా విధానాన్ని ఏర్పాటు చేశాడనీ స్కంద పురాణం చెబుతోంది. చారిత్రక ఆధారాల ప్రకారం- దీన్ని తొమ్మిదో శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. కార్తికమాసంలో పదిరోజుల పాటు జరిగే మహా జ్యోతి ఉత్సవం 3000 ఏళ్ల నుంచీ జరుగుతోందట. ఆ సమయంలో కొండమీద వెలిగించే దీపం కోసం పది అడుగుల ఎత్తూ, ఐదు అడుగుల చుట్టుకొలతా ఉన్న లోహపాత్రలో వెయ్యి కిలోల నెయ్యి పోసి 350 మీటర్ల పొడవున్న ప్రత్యేక వస్త్రంతో వత్తిని చేస్తారు. దాన్ని వెలిగించినప్పుడు ఆ జ్యోతి ఏడు అడుగుల ఎత్తుకి ఎగసి చుట్టుపక్కల 35 కిలోమీటర్ల వరకూ కనిపిస్తుంది. దీన్నే అగ్ని లింగంగా భావిస్తారు. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ శివునికి ప్రదక్షిణ చేసినట్లే అన్నది భక్తుల విశ్వాసం.

ఇదీ చూడండి:ఆ నాలుగు రాష్ట్రాల్లో మొక్కుబడిగా మహిళల 'వాటా'

ABOUT THE AUTHOR

...view details