ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఆరంభం నుంచి కొవిడ్ సంక్షోభం కారణంగా ఇంతవరకూ రైతులకు రుణాల పంపిణీ పెద్దగా లేదు. ఈ ఏడాది రూ. 5500 కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం. కొవిడ్ సంక్షోభం కారణంగా మరో రూ.800 కోట్లను సహకార బ్యాంకులకు నాబార్డు సమకూర్చింది. వాటితో కలిపి రూ.6,300 కోట్ల పంట రుణాలివ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం రూ.1,300 కోట్ల వరకే ఇచ్చారు.
మాఫీ అయితేనే.. మంజూరు చేస్తరట! - loan sanction for telangana farmers
రైతులకు పంట రుణాల మంజూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్), సహకార బ్యాంకులు వెనకబడుతున్నాయి. గత మూడేళ్లుగా రుణ పంపిణీ తగ్గుతోంది. గతేడాది అన్ని సహకార బ్యాంకులు కలిపి రూ.5,322 కోట్ల పంట రుణాలే ఇచ్చినట్లు తాజా నివేదికలో వెల్లడించాయి.
సహకార రుణాల పంపిణీకి పాత బకాయిల రికవరీతో బ్యాంకులు లంకె (లింకు) పెట్టడం వల్ల కొత్తవారికి అందడం లేదు. ఒక ప్యాక్స్ పరిధిలో గత మార్చి ఆఖరు నాటికి రుణాలు తీసుకున్నవారిలో కనీసం 60 శాతం మంది తిరిగి చెల్లిస్తేనే కొత్తవారికి మంజూరు చేస్తామంటున్నాయి. రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుండటంతో రికవరీ 30 శాతం కూడా లేదని ప్యాక్స్, బ్యాంకుల సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్రంలోని 906 ప్యాక్స్‌లో కొన్నింటిని సహకార బ్యాంకులకు, మరికొన్నింటిని వాణిజ్య బ్యాంకులతో అనుసంధానం చేశారు. రికవరీ విషయంలో వాణిజ్య బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో ప్యాక్స్ పరిధిలో కొత్త రుణాల మంజూరు పెద్దగా లేదు.
ఏడాదిలోపు చెల్లించినా వడ్డీ వసూలు
ఒక రైతు రూ.లక్ష రుణం తీసుకుని సరిగ్గా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తే వడ్డీ లేని రుణం (వీఎల్‌ఆర్)గా పరిగణించాలి. కానీ ప్రభుత్వం నుంచి వీఆర్‌ఎల్ పథకం కింద నిధులు రావడం లేదంటూ సహకార బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఏడాదిలోగా తిరిగి చెల్లించే రైతు నుంచి 7 శాతం, ఏడాదికి ఒక్కరోజు దాటినా 11, రెండేళ్ల వరకూ చెల్లించకపోతే 12.25 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నట్లు మెదక్ జిల్లాలోని ఓ ప్యాక్స్ సీఈఓ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టీఎస్‌క్యాబ్) ఎండీ నేతి మురళీధర్‌ను వివరణ కోరగా వీఎల్‌ఆర్ నిధులు రాకపోవడంతో పాత బాకీతో వడ్డీ వసూలు చేస్తున్నమాట వాస్తవమేనన్నారు. గతేడాది వరకూ రుణాల పంపిణీ తక్కువగా ఉన్నా ఈ ఏడాది రూ.6 వేల కోట్లకు పైగా ఇస్తామన్నారు.