- 2014 ఆగస్టు 1: శామీర్‌పేట శివారులో పోలీసులకు, నేరస్థుల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. కరడుగట్టిన నేరస్థుడు ఎల్లంగౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు మృతిచెందగా.. ఎస్సై వెంకట్‌రెడ్డి గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో ముస్తఫా హతమయ్యాడు.
- 2014 ఆగస్టు 14:శంషాబాద్ శివారులోని ఓఆర్‌ఆర్‌పై కరడుగట్టిన నేరస్థుడు కడలూరి శివ ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. వందల సంఖ్యలో గొలుసు చోరీలకు పాల్పడిన ఇతడిని శంషాబాద్ ప్రాంతంలో పట్టుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగించాడు.
- 2015 ఏప్రిల్ 4: సూర్యాపేట బస్టాండులో గుర్తుతెలియని దుండగులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక బస్సు నుంచి ఇద్దరు అనుమానితుల్ని కిందకు దించి విచారిస్తుండగా కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్ పైకి వారు కాల్పులు జరపగా.. దుర్మరణం పాలయ్యారు. సీఐ మొగులయ్య, హోంగార్డు కిషోర్ గాయపడ్డారు. దుండగులు జానకీపురం వద్ద తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లగా అక్కడా కాల్పులు జరిగాయి. ఎస్సై సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజు గాయపడ్డారు. నాగరాజు ఘటనాస్థలిలోనే చనిపోగా.. సిద్ధయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పుల సమయంలో అక్కడికి చేరుకున్న మరికొందరు పోలీసులు దుండగుల్ని హతమార్చారు. వారిని సిమి ఉగ్రవాదులు అస్లామ్ అయూబ్, ఎజాజుద్దీన్‌గా గుర్తించారు. మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి తప్పించుకొని వచ్చినట్లు తేలింది.
- 2015 ఏప్రిల్ 8:వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై జనగామ వద్ద మరో ఘటన జరిగింది. డీజేఎస్ సంస్థను నిర్వహిస్తూ పలువురు పోలీసుల్ని చంపిన వికారుద్దీన్, జకీర్, అహ్మద్, హనీఫ్, ఇజార్‌ఖాన్ బృందం హతమైంది. వరంగల్ కేంద్ర కారాగారం నుంచి వీరిని నాంపల్లి కోర్టుకు తీసుకొస్తుండగా జనగామ వద్ద వికార్ బృందం మూత్రవిసర్జనకు వ్యాన్‌ను ఆపగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కునేందుకు నిందితులు ప్రయత్నించారు. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు హతమయ్యారు.
- 2016 ఆగస్టు 8: మాజీ నక్సలైట్, కరడుగట్టిన నేరస్థుడు నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. షాద్‌నగర్ మిలీనియం టౌన్‌షిప్‌లో ఓ వ్యాపారిని బెదిరించేందుకు నయీమ్ వచ్చాడనే సమాచారంతో పోలీసులు కాపు కాశారు. ఓ ఇంటి నుంచి బయటికి వచ్చిన నయీమ్ పోలీసులను చూసి తన వద్ద ఉన్న ఏకే47తో కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.
- 2017 డిసెంబరు: భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది హతమయ్యారు. వీరంతా లంబాడాలు, ఆదివాసీలే కావడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.
- 2019 జూన్:కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో న్యూడెమోక్రసీ దళ నేత లింగన్న హతమయ్యాడు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
ఒక్కో ఎన్‌కౌంటర్‌దీ ఒక్కో కథ - encounters by telangana police
దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్తో యావత్ దేశం ఒక్కసారిగా దద్దరిల్లింది. ప్రజలంతా ముక్త కంఠంతో తెలంగాణ పోలీస్ జిందాబాద్ అంటూ నినదించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఎన్కౌంటర్ అంటే మావోయిస్టులే గుర్తొచ్చే పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత మావోయిస్టుల ఎన్కౌంటర్ ఘటనలు తగ్గినా.. ఇతర ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో ఒక్కో ఎన్కౌంటర్ది ఒక్కో కథ. అవేంటో మీరూ చూడండి..
ఒక్కో ఎన్‌కౌంటర్‌దీ ఒక్కో కథ