తెలంగాణ

telangana

ETV Bharat / city

Vaccination: ప్రత్యేక వ్యాక్సిన్​ డ్రైవ్​కు​ స్పందన కరవు.. వందశాతం అయ్యేదెప్పుడు..? - vaccination centers

గ్రేటర్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా అందించాలన్న లక్ష్యంతో బల్దియా, వైద్యఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్​కు ఆశించిన స్థాయిలో స్పందన లభించటం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి దాదాపు వారం రోజులు అవుతుండగా.. ఇప్పటి వరకు సుమారు లక్షా ముప్పై వేల మందికి మాత్రమే టీకాలు అందించారు. రోజుకి సరాసరి 25 వేలకు మించి టీకా తీసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఫలితంగా రోజులు గడుస్తున్నా.. వంద శాతం మార్కును చేరుకోవటం పట్ల సందిగ్ధత నెలకొంది.

less response to special vaccination drive in Hyderabad
less response to special vaccination drive in Hyderabad

By

Published : Aug 28, 2021, 5:22 PM IST

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవటమే కాదు.. ఇతరులను సమాజాన్ని రక్షించుకునేందుకు టీకాయే సురక్షిత మార్గమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు కోటి మందికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో వ్యాక్సినేషన్​ని వంద శాతం పూర్తి చేయాలని సర్కారు భావించింది. పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వ్యాపారాలు, సామాగ్రి కొనుగోళ్ల కోసం హైదరాబాద్​కు నిత్యం వేలాదిమంది వచ్చిపోతుంటారు. ఇక్కడ వైరస్ వ్యాప్తికి ఆస్కారం ఎక్కువున్నందున... బల్దియా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖతో కలిసి ప్రత్యేక డ్రైవ్​కు ఈ నెల 23న శ్రీకారం చుట్టారు.

స్పందన కరవు...

ఇప్పటికీ టీకా వేసుకోనివాళ్లు, రెండో డోస్ పూర్తి కాని వాళ్ల వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారు. దగ్గర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకునేలా సిబ్బంది ప్రోత్సహిస్తున్నారు. ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ టీకాలు తీసుకున్న ఇళ్లకు వ్యాక్సినేషన్ పూర్తైనట్టు ఓ స్లిప్​ని అంటిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ప్రజల నుంచి ఈ డ్రైవ్​కి వస్తున్న స్పందన మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. స్పెషల్ డ్రైవ్ ప్రారంభించే నాటికే జీహెచ్​ఎంసీ పరిధిలోని సుమారు 70 శాతం మంది 18 ఏళ్లుపై బడిన వారు టీకాలు తీసుకుని ఉండటం, మరికొందరికి టీకా తీసుకోవటం పట్ల అపోహలు ఉండటంతో వ్యాక్సిన్ డ్రైవ్​కి ఆశించిన స్పందన రావటం లేదు.

రోజుకు 25వేల మందికి వ్యాక్సిన్​...

జీహెచ్​ఎంసీ పరిధిలో మొత్తం 4846 కాలనీలు ఉండగా.. ఇప్పటి వరకు 1878 కాలనీల్లో టీకా డ్రైవ్ కొనసాగుతోంది. ఇక జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు కేవలం 1333 కాలనీలు మాత్రమే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తైనట్టు జీహెచ్​ఎంసీ ప్రకటిచింది. మరో 3513 కాలనీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రత్యేక డ్రైవ్ కోసం జీహెచ్​ఎంసీకి సంబంధించి రోజుకి సుమారు నాలుగు వేల మందికి పైగా సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ నుంచి సుమారు 1500మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే రోజుకి సుమారు ఆరు వేల మంది సిబ్బంది డ్రైవ్​లో భాగస్వాములవుతున్నారు. ఇక ఈ నెల 23న జీహెచ్​ఎంసీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా... ఇప్పటి వరకు టీకాలు అందించింది కేవలం 127236 మందికే. అందులో తొలిడోస్ తీసుకున్న వారు 107173 మంది కాగా.. మరో 20063 మందికి రెండో డోస్ అందించారు. అంటే రోజుకి మొదటి, రెండో డోస్ కలిపి ఇచ్చిన టీకాలు కేవలం పాతిక వేలు మాత్రమే. సుమారు పది నుంచి పదిహేను రోజుల్లోనే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బల్దియా అధికారులు భావించినప్పటికీ.. వ్యాక్సినేషన్​కి వస్తున్న స్పందన గమనిస్తే... వంద శాతం టీకాలు పూర్తి చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతీ ఒక్కరు వేయించుకోవాలని విజ్ఞప్తి..

జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి కావటం, ఇప్పటికీ కొన్ని వర్గాల ప్రజలు టీకా వేసుకునేందుకు సుముఖంగా లేకపోవటమే స్పందన కరువవడానికి కారణంగా కనిపిస్తోంది. ఇంటి వద్దే టీకాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని నగరవాసులను అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

RAINS: భాగ్యనగరంలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details