Lemon price: నాలుగు నిమ్మకాయలు కోసి.. ఆ రసాన్ని అన్నంలో కలిపేసి పులిహోర చేసే రోజులు పోయాయి. ఇప్పుడు పులిహోర కావాలంటే.. చింతపండు పులుసు కలపాల్సిందే. నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతుండటమే ఇందుకు కారణం. ఒక మోస్తరు కాయ, అందులోనూ రసం బాగా వచ్చేది కావాలంటే రూ.10పైనే పెట్టాలి. నాలుగు కొనాలంటే రూ.40 పైమాటే. నిమ్మధరలు ఏపీలో మునుపెన్నడూ లేని స్థాయికి చేరాయి.
ఒకదశలో కిలో రూ.180 దాకా ఎగబాకి, ప్రస్తుతం కాస్త దిగొచ్చింది. మే ఆఖరు దాకా ఇవే ధరలు కొనసాగుతాయనే అభిప్రాయం వ్యాపారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏపీలోని గూడూరు మార్కెట్లో రైతులు తెచ్చే నిమ్మకు రూ.50 నుంచి రూ.140 వరకు లభిస్తుండగా.. ఏలూరు, తెనాలి మార్కెట్లలో రూ.30 నుంచి రూ.70 మధ్య దక్కుతోంది. కాయలు చిన్నవిగా ఉంటే తక్కువ ధర లభిస్తోంది.
భారీవర్షాల ప్రభావమే కారణం..ఏపీలో గతేడాది కురిసిన భారీవర్షాలు నిమ్మ రైతుల్ని దెబ్బతీశాయి. నవంబరులో భారీగా కురవడంతో.. ఏలూరు, తెనాలి ప్రాంతాల్లోని తోటల్లో పూత రాలిపోయింది. ఈ ప్రభావం కాపుపై పడింది. గుజరాత్, మహారాష్ట్రల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొనడంతో.. నిమ్మకాయల దిగుబడి పడిపోయింది. గూడూరు ప్రాంతంలో పూత పిందెగా మారాక వానలు కురిశాయి. దీంతో కాపు నిలబడింది. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌కు రోజుకు 15 లారీల నిమ్మకాయలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. దిగుబడులు భారీగా తగ్గాయి.