లష్కర్ బోనాల(Lashkar Bonalu)సంబురం అంబరాన్నంటింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో.. తెల్లవారుజాము 4 గంటలకే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రభుత్వం తరఫున తొలిబోనం సమర్పించారు. భక్తులు వేకువజామునే అమ్మవారికి బోనమెత్తి ఆలయానికి పోటెత్తారు.
కోవెలలో కోలాహలం..
శివసత్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలంతా ఉదయాన్నే పట్టుచీరలు కట్టుకుని ముత్తైదువుల్లా అలంకరించుకుని బోనమెత్తి అమ్మవారి ఆశీర్వాదం కోసం తరలివచ్చారు. పిల్లాపెద్దలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
పకడ్బందీ ఏర్పాట్లు..
ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. 2వేల 500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా ప్రముఖులు ఇవాళ మహంకాళి(Lashkar Bonalu)ని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు మరవొద్దని....అందరూ తప్పక మాస్క్ ధరించాలని మంత్రి తలసాని సూచించారు. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.