తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్​

దావోస్​లో మంత్రి కేటీఆర్ పెట్టుబడుల వేట ప్రారంభించారు. తెలంగాణ సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో ఉందని... పెద్ద కంపెనీలు ఇప్పటికే తమ కార్యాయాలను ఏర్పాటు చేశాయన్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిథులను కలిసి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు.

By

Published : Jan 21, 2020, 8:22 PM IST

Ktr_At_Dawos
తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్​

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన మంత్రి కేటీఆర్ పెట్టుబడుల వేట ఆరంభించారు. పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మంత్రి... తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. 'ఇండియా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్ అంశం'పై నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న కేటీఆర్... ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 20 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న యువత భారతదేశానికి అద్భుతమైన బలమని చెప్పారు.

అత్యంత డైనమిక్​ నగరం

తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ఇన్నోవేషన్ రంగం గురించి ప్రస్తావించిన మంత్రి... రాష్ట్రం సరళతర వాణిజ్యవిధానంలో అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్​ బుక్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కేంద్ర కార్యాలయాల తర్వాత అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్​లో ఏర్పాటు చేసుకున్నాయని మంత్రి వివరించారు. ప్రపంచంలోని 130 నగరాల్లో అత్యంత డైనమిక్ నగరంగా హైదరాబాద్​ని జేఎల్ఎల్ గుర్తించిందని చెప్పారు. సరళతర వాణిజ్యంతో పాటు తక్కువ ఖర్చు, అధిక నాణ్యతపై దృష్టి సారించినట్లు వివరించిన కేటీఆర్... నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

మరింత బలోపేతం కావాలంటే...

భారత్​తో పాటు రాష్ట్రాలన్నీ మరింత బలోపేతం కావాలంటే.. ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధి, మౌలిక వసతులు అన్న మంత్రాన్ని పాటించాలని మంత్రి కేటీఆర్​ సూచించారు. దావోస్​లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్​లో పలు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను మంత్రి కలిశారు. రోషే ఛైర్మన్ క్రిస్టోఫర్ ప్రాన్జ్​తో సమావేశమైన మంత్రి... ఫార్మాసిటీ, వైద్యోపకరణాల పార్కుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. హెచ్​పీ సీఓఓ విశాల్ లాల్, అపోలో టైర్స్ ఉపాధ్యక్షుడు నీరజ్ కన్వర్, కాల్స్​ బెర్గ్ గ్రూప్ ఛైర్మన్ ఫ్లెమింగ్ బెసెన్ బాచర్, పీఅండ్ జీ దక్షిణాసియా సీఈవో మాగేశ్వరన్ సురంజన్​లతోనూ సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్​తోపాటు పలు రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ వివరించారు.

తెలంగాణలో అద్భుత వ్యాపార అవకాశాలున్నాయి: కేటీఆర్​

ఇవీ చూడండి: భారత్‌లో పెట్టుబడులకు మొదటి మజిలీ తెలంగాణయే

ABOUT THE AUTHOR

...view details