దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జేఈఈ మెయిన్ (నాలుగో విడత) ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక విద్యార్థుల ర్యాంకులను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా కొనసాగించారు. నలుగురు ఏపీ విద్యార్థులకు, ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణ నుంచి కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్య, ఏపీ నుంచి దుగ్గినేని వెంకటపనీష్, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కర్నం లోకేశ్‌కు మొదటి వచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.in లో తెలుసుకోవచ్చు.
మంగళవారం రాత్రి జేఈఈ ఫలితాలు ప్రకటిస్తారని పేర్కొనడంతో విద్యార్థులు వేచిచూశారు. తీరా మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫలితాలు వెల్లడయ్యాయి. జేఈఈ మెయిన్ సెషన్-4 పరీక్ష ఆగష్టు 26, 27, 31, సెప్టెంబర్ 1న జరిగింది. సెప్టెంబర్ 6న పరీక్ష పత్రం కీ పేపర్‌ను విడుదల చేశారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 11న ప్రారంభం అవ్వాల్సి ఉండగా, ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబర్ 13కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.