తెలంగాణ

telangana

ETV Bharat / city

అనిశా తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు.. ఈవో పాత్రే కీలకం - ఈవో పాత్ర ఉందంటూ గుర్తించిన అనిశా అధికారులు

విజయవాడ దుర్గగుడిలో అనిశా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. 15కు పైగా అవకతవకల్లో ఈవో సురేశ్​బాబు పాత్ర గుర్తించినట్టు సమాచారం. వాటిలో కీలకమైన రెండు సంఘటనలకు సంబంధించి ఆయన హస్తం ఉన్నట్టు ఆధారాలతో సహా నమోదు చేసినట్టు తెలిసింది.

It is reported that the role of Eo Suresh Babu has been identified in more than 15 scams
ఈవో పాత్ర ఉందంటూ గుర్తించిన అనిశా అధికారులు

By

Published : Feb 26, 2021, 9:27 AM IST

ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై సుదీర్ఘకాలం బస్సు క్లీనర్‌గా పనిచేసిన లీలాప్రసాద్‌ అనే రెగ్యులర్‌ ఉద్యోగి విషయంలో ఈవో, మరికొందరు అధికారులు మోసపూరితంగా వ్యవహరించినట్టు అనిశా తనిఖీల్లో గుర్తించారు. 19ఏళ్లకు పైగా క్లీనర్‌గా పనిచేసిన లీలాప్రసాద్‌కు ఎలాంటి పదోన్నతి ఇవ్వలేదని, అర్హత ఉన్నందున ఇప్పటికైనా కండక్టర్‌గా ఇవ్వాలంటూ గతంలో పనిచేసిన ఈవోలు దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు చేశారు. దీంతో 2020 జనవరిలో అతనికి పదోన్నతి కల్పించాలంటూ కమిషనర్‌ లేఖ రాశారు. ఈ విషయంపై లీలాప్రసాద్‌ ఈవోను కలిశారు. తనకు కండక్టర్‌గా పదోన్నతి కల్పించేందుకు అవసరమైన లైసెన్స్‌ కూడా ఉందని తెలియజేశారు.

కానీ.. అతడికి ఉన్న లైసెన్స్‌ కాలపరిమితి తీరిపోయిందని, పదోన్నతికి అర్హుడు కాడంటూ కమిషనర్‌కు ఈవో లేఖ పంపారు. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. 2020 మేలో లీలాప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందారు. చనిపోయే వరకు తన పదోన్నతి కోసం ఈవో చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పదోన్నతికి సంబంధించి నివేదిక తనిఖీల్లో గుర్తించినట్టు తెలిసింది. దీనిపై లీలాప్రసాద్‌ భార్యను పిలిచి ఏసీబీ అధికారులు విచారించారు. తన భర్తకు పదోన్నతి ఇవ్వాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగారని, అంత ఇచ్చుకోలేమన్నందుకే.. వేధింపులకు గురిచేశారంటూ ఆమె చెప్పినట్టు సమాచారం.

వాస్తవంగా లీలాప్రసాద్‌కు కండక్టర్‌ లైసెన్స్‌ గడువు 2020 చివరి వరకు ఉండగా, అంతకుముందే అయిపోయిందంటూ ఈవో రాసి పంపించిన విషయం ఆధారాలతో సహా గుర్తించారు. అర్హుడైన ఓ ఉద్యోగి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేలా మోసపూరితంగా ఎందుకు వ్యవహరించారనే విషయంపై ప్రస్తుతం అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశాకే.. దీనిపై మరింత స్పష్టత వస్తుంది.

అన్నదానం ఉద్యోగి పేరుతో..

దుర్గగుడి అన్నదానం విభాగంలో అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేసే సిద్ధూ. అనే వ్యక్తి రెండేళ్ల కిందట ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడు. కానీ.. అతడి పేరుతో జీతం నెల నెలా ఇస్తున్నట్టు రికార్డుల్లో ఉంది. దీనిపై ఏసీబీ లోతుగా దృష్టిపెట్టగా.. సిద్ధూ స్థానంలో సందీప్‌ అనే మరో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినట్టు బయటపడింది. జీతం కూడా సిద్ధు పేరుతోనే ఇస్తున్న విషయం తేలింది. ఇందులోనూ పరిపాలన విభాగం సిబ్బందితో పాటు ఈవో పాత్రపైనా దృష్టిపెట్టారు. ఒక ఉద్యోగి పేరుతో ఇంకొకరిని పెట్టి, నెల నెలా జీతం ఇవ్వడం నేరం. దీనికి సంబంధించి ఇప్పటికే ఈఓ వివరణ కూడా కమిషనర్‌ కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈవో సురేష్‌బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేయబోతోందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో కొత్తగా మరొకరు వస్తున్నారంటూ రెండు, మూడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో సగానికిపైగా హత్యలకు వివాదాలు.. వివాహేతర సంబంధాలే కారణం

ABOUT THE AUTHOR

...view details