తెలంగాణ

telangana

ETV Bharat / city

నిరుద్యోగులకు ఉపాధి బాట వేస్తున్న ఈఎస్‌సీఐ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ పూర్తి చేసినా ఉపాధి లభిస్తుందనే నమ్మకం లేదు. సంప్రదాయ కోర్సులు, టెక్‌ కోర్సులు... ఇలా ఎటువైపు వెళ్లాలో తెలియక విద్యార్థులు తికమక పడుతున్నారు. ఉపాధికి దూరంగా నిలిచిపోతున్నారు. అయితే కొలువులిచ్చే కంపెనీలు మాత్రం డిగ్రీతో పాటు అనుబంధ నైపుణ్య కోర్సులు చేసిన వారినే ఎంచుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ ప్రాధాన్యమున్న కోర్సులతో ఉద్యోగ అవకాశాల్ని పెంచే ప్రయత్నం చేస్తోంది.. ఇంజినీర్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. పరిశ్రమల్లో అవసరాలు ఎలా ఉన్నాయి...? ఎటువంటి నైపుణ్యాల్ని కోరుకుంటున్నాయి..? వంటి అంశాల్లో మెరుగైన శిక్షణ ఇస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగ బాట వేస్తున్నాయి.

it courses in Engineer Staff College of India helps unemployed to get a job
ఇంజినీర్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

By

Published : Feb 19, 2021, 2:01 PM IST

ఇంజినీర్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

ఇంజినీర్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.... అప్పుడే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి బయటకు వచ్చిన వారికి, పలు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న యువ ఇంజినీర్లకు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తోంది. 1981లో గచ్చిబౌలిలో ఏర్పాటైన ఈ సంస్థ... 40 ఏళ్లుగా అనేక విభాగాల్లో సేవలందిస్తోంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీడీఎం కోర్సులు అందుబాటులోకి తెచ్చింది.

ఈఎస్​సీఐలో పవర్‌, ఎనర్జీ, ఐటీ, ఆటో డెవలెప్‌మెంట్‌ రిసోర్స్‌ వంటి విభాగాల్లో శిక్షణ తీసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి యువత పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రైవేట్‌ కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగులు సైతం నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈఎస్​సీఐని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేయాలా..? ఎంబీఏ చేయాలా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఉపాధి అవకాశాలున్నా డిప్లొమా కోర్సుల వైపు మాత్రం అంతగా మెుగ్గు చూపట్లేదు. కానీ, ఆ కోర్సులు చేసిన వారికే మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ తరహా కోర్సులపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు..ఈఎస్​సీఐ నిర్వాహకులు.

క్యాట్‌ ప్రవేశ పరీక్ష అర్హత సాధించిన వారికి పీజీడీఎం జనరల్‌ కోర్సులో సీట్లు కేటాయిస్తున్నారు. పీజీడీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్‌ కోర్సులో ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ప్రవేశం కల్పిస్తున్నారు... నిర్వాహకులు. నాణ్యమైన శిక్షణా తరగతులతో.. అన్నివిధాల మెరుగైన నైపుణ్యాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో కేవలం డిగ్రీ ఒక్కటే చేస్తే ఉపాధి లభించడం కష్టమవుతోంది. డిగ్రీతో పాటు అనుబంధ కోర్సులు చేసిన వారికే ప్రాధాన్యం దక్కుతుంది. ఈఎస్​సీఐలో అందిస్తున్న కోర్సులు ఏఐటీసీ ఆమోదం పొందడంతో పాటు... పలు సంస్థలతో ఒప్పందాలు ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు విద్యార్థుల్ని పలకరిస్తున్నాయి.

ఈఎస్​సీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణతో పాటు... ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఆడిట్‌లు కూడా చేస్తుంటుంది. పలు ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్, కన్సల్టేషన్ సర్వీసులు సైతం అందిస్తోంది. ఈ సంస్థ సేవల్ని దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో అనేక సంస్థలు వినియోగించుకుంటున్నాయి. వృత్తి విద్యా కోర్సులు అంటే డబ్బులు కడితే చాలు సర్టిఫికెట్‌ ఇస్తారు. కళాశాలకు వెళ్లకపోయినా సరే పరీక్షలు రాస్తే ...చేతికి పట్టా వస్తుందనే...విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, ఈఎస్​సీఐలో అలా కాదు. నేర్చుకునే అంశాలకు, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా, కోర్సు పూర్తైన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈఎస్​సీఐని ప్రత్యేకంగా నిలిపే వాటిల్లో డీసీపీ సెంటర్‌ కూడా ఒకటి. పరిశ్రమలకు అవసరమైన త్రీడీ నమూనాలు ఇక్కడ రూపొందిస్తారు. రక్షణ ,ఆరోగ్య రంగాల్లో ఇంప్లాట్స్‌ డిజైన్స్‌ కొరకు డీసీపీ సెంటర్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

'మేము అందిస్తున్న కోర్సులు వైవిధ్యమైనవి. మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పీజీ డిప్లొమా అందిస్తున్నాం. ఇటీవల కాలంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ప్రభుత్వాలు సైతం ఈ దిశగా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ విద్యతోపాటు అదనంగా సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడమే మా లక్ష్యం.'

- అపరాజిత దాస్‌ గుప్తా, ఉపాధ్యాయురాలు

'ఆర్ట్స్‌, ఫైనాన్స్‌, ఇంజినీరింగ్‌ వంటి భిన్నరకాలైన కోర్సులకు చెందిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. చదువు ఒక్కటే కాదు అన్ని రకాలైన నైపుణ్యాలు పెంపొందించుకోగలుగుతున్నాం. వేదికలపై మాట్లాడటం సహా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సైతం మెరుగుపరుచుకుంటున్నాం.'

- కిరణ్ చిండాలియా, పూర్వ విద్యార్థి

'విద్యార్థులు ఇక్కడికి వచ్చి సొంతంగా ప్రొటోటైప్స్‌ చేస్తారు. ఇలా చేయటం వల్ల కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డిజైన్ అండ్‌ ప్రోటోటైప్‌ సెంటర్‌ నైపుణ్యాల ద్వారా చాలా మంది విద్యార్థులు మంచిగా స్థిరపడ్డారు. మేము ప్రముఖ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మా సేవల్ని అందిస్తుంటాం.'

- సాయి కిషోర్, ఆచార్యులు

ABOUT THE AUTHOR

...view details