తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి రాజుకుంది. హస్తం ముఖ్య నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ పరువు బజారున పడుతోందని తెలిసినా... వ్యక్తిగత ప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. ప్రతిపక్ష పార్టీగా సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాల్సిన నేతలు.. సొంత పార్టీ నాయకుల తప్పులను వెతికే పనిలో పడ్డారు. పైచేయి సాధించేందుకు ఎత్తులు, పైఎత్తులతో ముందుకు వెళ్తున్నారు.
రేవంత్ దూకుడును తప్పుగా..
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎంపీ రేవంత్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. రేవంత్ దూకుడుతనాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచురితమైన.. వార్తల్ని హైకమాండ్‌కి నివేదించారు. సొంత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై వచ్చిన ఆరోపణలు ఖండించి మద్దతుగా నిలువాల్సిన నేతలు.. అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు.
కేటీఆర్ కట్టుకుంటే తప్పేంటి..
111 జీవో పరిధిలో కేటీఆర్ నిబంధనలను ఉల్లంఘించి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాని జన్వాడ వద్దకి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తప్పుబట్టారు హస్తం అగ్రనేతలు. 111 జీవో పరిధిలో కేటీఆర్ ఒక్కరే భవన నిర్మాణం చేయలేదని, అక్కడ చాలా మంది పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారని.. అలాంటప్పుడు కేటీఆర్ కట్టుకుంటే తప్పేంటన్న తీరులో నాయకులు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.