తెలంగాణ

telangana

ETV Bharat / city

పండిస్తే ఆదాయం.. తింటే ఆరోగ్యం

వంట నూనెల ధరలు సలసలా మరుగుతున్నాయి. ఈ పంటల సాగులో మన వెనకబాటే కారణంగా.. ఏటా రూ.70 వేల కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. నూనె గింజల పంటలకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పంటలు పండిస్తే ఈ సొమ్మంతా మన రైతులకే అందుతుందని భారత నూనెగింజల పరిశోధన సంస్థ’ (ఐఐఓఆర్‌) డైరెక్టర్‌ సుజాత తెలిపారు. దేశవ్యాప్తంగా నూనెగింజల పంటల పరిశోధనలను రాజేంద్రనగర్‌లోని ఐఐఓఆర్‌ పర్యవేక్షిస్తుంది. వీటి సాగు, పరిశోధనలపై పలు అంశాలను వివరించారు.

Indian Oilseeds Research Institute
పండిస్తే ఆదాయం.. తింటే ఆరోగ్యం

By

Published : Mar 21, 2021, 8:57 AM IST

పూర్వీకులు అవిసె ఉత్పత్తులను నిత్యం వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు. క్యాన్సర్‌, గుండెజబ్బుల నివారణ, శరీర బరువు తగ్గించడంలో కీలకమైన ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో మాత్రమే ఉంటాయని చెబుతారు. అవి అవిసె గింజల పొడిలోనూ లభిస్తున్నట్లు పరిశోధనల్లో గుర్తించాం. పుణెలోని పరిశోధనా సంస్థ అవిసె గింజల నూనెతో తయారుచేసిన క్యాప్సూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని రోజూ ఒకటి వాడినా చాలు. కుసుమ, నువ్వుల నూనెల్లోనూ ఎన్నో పోషకాలున్నాయి. నువ్వులలోనూ అంతకు మించిన పోషక గుణాలున్నాయి. ఈ తరహా నూనె గింజల పంటలు పండిస్తే రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని, దిగుబడులు తగ్గించుకునేందుకు మార్గం సుగమం అవుతుందని భారత నూనెగింజల పరిశోధన సంస్థ’ (ఐఐఓఆర్‌) డైరెక్టర్‌ సుజాత అన్నారు.

వంటనూనెల కొరత తీవ్రంగా ఉన్నా నూనెగింజల పంటల సాగు విస్తీర్ణం ఎందుకు పెరగడం లేదు ?

నూనెగింజల పంటల సాగుపై రైతులు ఇప్పటికీ దృష్టి పెట్టడం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించడానికి వీటిని మించిన పంటలు లేవు. మేం విడుదల చేసిన సంకరజాతి విత్తనాలను వాడితే అధిక దిగుబడి సాధించవచ్చు. వాటితో పంటలు సాగు చేస్తూ కొందరు లాభాలు గడిస్తున్నారు.

ఏయే ప్రాంతాల్లో రైతులు లాభాలు సాధిస్తున్నారు?

వరి పంట కోసిన తర్వాత అందులో నువ్వులు, పొద్దుతిరుగుడు పంట వేస్తే మంచి దిగుబడి వస్తుంది. నిజామాబాద్‌ జిల్లాలో కొందరు రైతులు పసుపు తర్వాత ఫిబ్రవరిలో నువ్వులు వేసి ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. రూ.15 వేల పెట్టుబడితో 4 నెలల్లో రూ.50 వేల ఆదాయం పొందారు. పొద్దుతిరుగుడు సాగుతో అదే జిల్లాలో రైతులు లాభాలు గడిస్తున్నారు. మహబూబ్‌నగర్‌, రాయలసీమ వంటి ప్రాంతాల్లో వీటి సాగుకు అనువైన భూములు, వాతావరణం ఉన్నాయి.

తెలంగాణ రైతులు ఎలాంటి విధానాలు అనుసరించాలి?

ఈ పంటల ప్రాధాన్యాన్ని రైతులు, ప్రజలు గుర్తించాలి. ఉత్తర తెలంగాణలో 7 లక్షల ఎకరాల్లో వానాకాలం సోయాచిక్కుడు వేస్తున్నారు. ఆ పంట కోతలయ్యాక కుసుమ సాగు చేస్తే కొద్దిపాటి నీటితోనే మంచి దిగుబడి వస్తుంది. కుసుమ నూనెలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. పురాతన కాలంలో మన రైతులు ఈ పంటలు ఎక్కువగా పండించేవారు. కొన్నేళ్లుగా వీటి సాగు తగ్గడంతో వంటనూనెల దిగుమతులు పెరిగాయి.

నూనెగింజల సాగును ఎలా ప్రోత్సహిస్తున్నారు?

తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో సులభంగా పండే నువ్వులు, వెర్రినువ్వులు, అవిసెలు, కుసుమ పంటల సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. వీటి సాగు, పరిశోధనలు పెంచడానికి ప్రత్యేక ప్రాజెక్టు కింద రూ.80 కోట్లు కేటాయించింది. నువ్వులకు క్వింటా మద్దతు ధర రూ.6855గా ప్రకటించింది. నూనెగింజల పంటల్లో ఇంత మద్దతు ధర మరే పంటకు లేదు.

అవిసె నుంచి లెనిన్‌ కాటన్‌

‘లెనిన్‌ కాటన్‌’ వస్త్రాలు మార్కెట్లో మంచి ధర పలుకుతున్నాయి. వీటి తయారీకి ముడిపదార్థం అవిసె మొక్కల కాండం నుంచి వచ్చే నార. బెల్జియం, ఫ్రాన్స్‌ తదితర దేశాల రైతులు అవిసెను ఎక్కువగా పండించి లెనిన్‌ కాటన్‌ తయారీతో లాభాలార్జిస్తున్నారు.

వంటనూనెల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వంటకు ఒకే రకం నూనెను దీర్ఘకాలం వాడకూడదు. ఎందుకంటే ఏ ఒక్క నూనెలోనూ అన్ని రకాల పోషకాలు లేవు. ఒక్కో వారం ఒక నూనెను (వేరుసెనగ, కుసుమ, అవిసె, నువ్వులు, పొద్దుతిరుగుడు) మార్చి మార్చి వాడితే అన్ని పోషకాలూ అందుతాయి. ప్రాంతాన్ని బట్టి కూడా నూనెలు ఎంపిక చేసుకోవాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవనూనెను అధికంగా వాడతారు. దాంతో వేడి పెరుగుతుంది. అది దక్షిణాదిన నిత్యం వాడక్కర్లేదు. ఖరీదైన ఆలివ్‌నూనెనూ ఇటీవల కొందరు వంటకు వాడుతున్నారు. మన వంటల్లో వేపుళ్లు ఎక్కువ. ఆలివ్‌, అవిసె నూనెలను ఎక్కువ మరిగించి వాడితే పొగవచ్చి వాటి రుచి మారిపోతుంది. గానుగ నూనెలు ఆరోగ్యానికి మంచివి. వీటితో ఈ-విటమిన్‌ సహజంగా లభిస్తుంది.

మంచి నూనెలను ప్రజలకు అందించడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు?

మార్కెట్‌లో లభించే కుసుమ, నువ్వుల నూనెలలో ఇతర నూనెలు కలిపి అమ్ముతున్నారు. అందుకే ఐఐఓఆర్‌ ప్రధాన కార్యాలయంతో పాటు వికారాబాద్‌ జిల్లా తాండూరులో కుసుమ నూనె ఉత్పత్తి కేంద్రం పెట్టి స్వచ్ఛమైన నూనెను ప్రజలకు విక్రయిస్తున్నాం. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోనూ గానుగ నూనెల తయారీకి యంత్రాలిచ్చాం. జిల్లాల్లో గానుగ నూనె యంత్రాలతో కేంద్రాలు పెడుతున్నాం. రైతులు పంటను అక్కడికి తీసుకెళ్లి నూనె ఉత్పత్తి చేసుకుని సొంత బ్రాండుతో అమ్ముకోవచ్చు. తద్వారా రైతులకు ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన నూనెలు లభించేలా చూడాలనేది ఐఐఓఆర్‌ లక్ష్యం.

ఇవీచూడండి:ఏ నూనె వాడితే ఆరోగ్యానికి మేలు..!

ABOUT THE AUTHOR

...view details