Karmanghat incident: మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌ఛార్జ్ డీజీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ కర్మన్‌ఘాట్ ఘటనపై సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్రలతో సమీక్ష నిర్వహించారు. ఇంటలిజెన్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్, కౌంటర్ ఇంటిలిజెన్స్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని అంజనీ కుమార్ హెచ్చరించారు. కర్మన్‌ఘాట్ ఘటనలో 5 కేసులు నమోదు చేశామని.. ఏడుగురు అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. ఏడుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించామన్నారు.
'వారంతా రోహింగ్యాలే..: బండి సంజయ్'
కర్మన్‌ఘాట్‌లో గోరక్షక్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తల్వార్లు, ఐరన్ రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. గోవధపై నిషేధం ఉన్న దేశంలో యథేచ్చగా గోవులను కబేళాలకు తరలిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తల్వార్లు, ఐరన్ రాడ్లు పట్టుకొని తిరుగుతున్నవారంతా రోహింగ్యాలేనని తమ సమాచారం ఉందని సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దాడులకు పాల్పడ్డ రోహింగ్యాలను అరెస్టు చేయాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.
'గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులపై దాడులు చేశారు. దాడులకు పాల్పడినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.'