తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓ మంచి దేవుడా..! ఎందుకయ్యా గిట్ల చేసినవ్..?!

దేవుడా.. ఓ మంచిదేవుడా..! అడక్కుండానే జన్మనిచ్చావ్.. ఆడుకోవడానికి దోస్తుగాళ్లనిచ్చావ్.. తినడానికి నూడుల్స్ ఇచ్చావ్.. తాగడానికి సూప్​లు ఇచ్చావ్.. కానీ.. ఎందుకయ్యా గిట్లా జేశినవ్..? ఏజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లెక్క దూసుకెళ్తోంది.. మరి, ఫేస్​ను ఎందుకయ్యా 12 దగ్గర్నే లాక్ చేసినవ్..? అమ్మాయిలకు ప్రపోజ్ చేద్దామంటే.. "చో చ్వీట్" అని లాలీపప్ ఇస్తున్నరయ్యా? అందరూ బచ్చాగాని లెక్క చుస్తున్నరు.. చివారఖరికి.. పని చేస్కుందామని ఉద్యోగం అడిగితే.. పక్కకెళ్లి ఆడుకో అంటున్నరయ్యా!! ఇందేయ్యా ఇదీ..?!!

దేవుడా
దేవుడా

By

Published : Sep 14, 2022, 7:45 PM IST

వయసు పెరగడం మన చుట్టూ చాలా మందికి పెద్ద సమస్య. వెనక 60 వచ్చినా.. "ఐయామ్ స్వీట్ సిక్స్ టీన్" అనిపించుకోవడానికి ఆరాటపడే వాళ్లు మన చుట్టూ కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. ముఖం మీది ముడతలు కవర్ చేసుకోవడానికి వాళ్లు చేసే పోరాటం.. ఏ యుద్ధానికీ తీసిపోదు. అయితే.. ఇక్కడ మాత్రం రివర్స్. పెరుగుతున్న వయసు ఫేస్​లో కనిపించట్లేదని తెగ బాధపడిపోతున్నాడు ఓ వ్యక్తి! ఈ కండీషన్ చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతోందని అంటున్నాడు. ఇంతకీ ఆయనెవరు? ఆ సమస్య ఏంటీ? అన్నది చూద్దాం.

12 ఏళ్ల బాలుడిలా కనిపిస్తున్న యువకుడు

ఇదిగో ఇతనే మన స్టోరీలో హీరో. ఇతని ఫేస్ చూసి చెప్పండి.. వయసు ఎంత ఉండొచ్చు? ఇతనికి పదేళ్లు అని చెప్పినా నమ్ముతారు చాలా మంది. కానీ.. ఇతని నిజమైన వయసు 27 ఏళ్లు. లెక్క ప్రకారం పెళ్లైతే ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యేవాడే! కానీ.. పాపం ఏం చేస్తాడు? వాస్తవ పరిస్థితి ఇదీ! టీనేజ్ మొత్తం ఫ్రిజ్ లోంచి తీసిన ఐస్​క్రీమ్​లా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు యంగ్ ఏజ్ కూడా ముదిరిపోయిన బెండకాయలా మారిపోతోందని ఒకటే బాధ! ఆ బాధలు ఇలా ఉంటే.. అసలు బాధ వేరే ఉంది. అదే ఉపాధి సమస్య.

ఒంటి మీదికి మూడు తక్కువ ముప్పై వచ్చినయ్.. ఇంకా ఎంత కాలం అమ్మానాన్నల మీద ఆధారపడతాడు? అసలే.. ఇంట్లో పాత తెలుగు సినిమాకు ఏ మాత్రం తగ్గని కష్టాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పనీపాటా లేకుండా కూర్చోవాలని అతనికీ లేదు. కానీ.. ఉద్యోగమే లేదు. "ఇంట్లో కూర్చుంటే ఎవరిస్తారు?" అని అనకండి. పాపం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ.. అందరూ పదేళ్ల పిల్లాడిలా చూసి, ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. బాల కార్మికుడిని పనిలో పెట్టుకున్నారని అధికారులు తమ చీటీ చించేస్తారన్నది యజమానుల భయం మరి. ఆ మధ్య మిత్రులతో కలిసి ఉద్యోగానికి వెళ్తే.. వాళ్లకు పచ్చజెండా ఊపారు. మనోడికి రెడ్ ఫ్లాగ్ ఎత్తారు.

12 ఏళ్ల బాలుడిలా కనిపిస్తున్న యువకుడు

ఇలాంటి పరిస్థితుల్లో.. మనోడు చేసిన ఓ చిన్న పని.. పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. తన పరిస్థితిని, ఇంట్లో ఆర్థిక దుస్థితిని వివరిస్తూ.. టిక్​టాక్​లో ఓ వీడియో అప్ లోడ్ చేశాడు. ఉద్యోగం చేయాలని ఉన్నా.. ఎవ్వరూ ఇవ్వట్లేదని అందులో ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో.. చూస్తుండగానే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ యువకుడి దీనగాథ.. మిలియన్ల మంది హృదయాలను తాకింది. అది చూసిన చాలా కంపెనీలు జాబ్ ఆఫర్ చేశాయి.

అందులో ఒక జాబ్ ను సెలక్ట్ చేసుకున్నట్టుగా.. ఇటీవల అప్ లోడ్ చేసిన మరో వీడియోలో చెప్పాడు. ఈ ఉద్యోగం ద్వారా కావాల్సినంత డబ్బు సంపాదించి.. తన తండ్రికి మెరుగైన చికిత్స అందిస్తానని.. ఆర్థిక కష్టాలు తీరిన తర్వాత.. మాంచి అమ్మాయిని సెలక్ట్ చేసుకొని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్తున్నాడు. ఇతగాడి స్టోరీ.. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖ వార్తగా ప్రసారమైంది.

అన్నట్టూ.. అతని పేరు, ఊరు చెప్పలేదు కదా! అతని పేరు మావో షెంగ్. ఊరు చైనా దేశంలోని డోంగువాన్‌. మరి, ఇంతకీ.. అతని సమస్యకు కారణం ఏంటీ? ముప్పై ఏళ్లకు దగ్గరగా వచ్చినా.. ఇంకా పదేళ్ల పిల్లవాడిలాగానే ఎందుకు కనిపిస్తున్నాడు? అంటే.. మెడికల్ ఎక్స్​పర్ట్స్ చెబుతున్న మాట ఏమంటే.. పిట్యూటరీ గ్రంథిలో తేడా వల్లనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా.. సోషల్ మీడియా మావో షెంగ్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఉద్యోగం చేసుకుంటూ.. హాయిగా జీవితం కొనసాగించాలని కోరుకుందాం.

ABOUT THE AUTHOR

...view details