తెలంగాణ

telangana

ETV Bharat / city

మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే ! - ఏ తింటే కె విటమిన్ పెరుగుతుంది

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను అలిగాను పోండి! విటమిన్లు అంటే.. మీరు ఎంతసేపూ ఎ,బి,సి,డి,ఇ అని మాత్రమే చెబుతారు... అసలు ‘కె’ అనేది ఒకటుందని అనుకోనే అనుకోరు! అందుకే నా గురించి చెప్పుకొందామని... నేనే.. ఇదిగో ఇలా మీ దగ్గరికి వచ్చాను!!

importance of k vitamin in human body
ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

By

Published : Dec 10, 2019, 1:53 PM IST

అది ఆదివారం.. మీకు స్కూలు లేదు. మీరు, మీ చెల్లాయి హాయిగా ఆడుకుంటున్నారు. ఉన్నట్లుండి మీ చెల్లాయి కిందపడిపోయింది. పాపం మోకాలు దగ్గర గాయమైంది. కొంచెం రక్తం వచ్చింది. అది చూసి మీ అమ్మ పరుగు పరుగున వచ్చారు. అప్పటికే రక్తం కారడం ఆగిపోయిందనుకోండి. వెంటనే మీ అమ్మ గాయాన్ని కడిగి ఏదో మందు రాశారు. ఇలాంటివి మీకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎందుకంటే మీరు ఆడుకుంటుంటారు. ఆ సమయంలో గాయాలవుతూ ఉంటాయి. రక్తం రావడమూ తప్పదు. అలాంటప్పుడు మీ అమ్మకంటే ముందే నేను మీకు మందేస్తాను తెలుసా?! అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం! ఎలా అంటారా? మీకు గాయమై రక్తం కారుతుంటే.. నేను వెంటనే స్పందిస్తాను. గాయమైన చోట రక్తం గడ్డకట్టేలా చేస్తా... హాం..ఫట్‌.. అని మంత్రం వేసినట్లు రక్తం కారడం ఆగిపోతుంది. అందుకే నన్ను రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్‌ అంటారు.

ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

మీకు తెలుసా?

నా రసాయన నామం ఫిల్లోక్వినోన్‌. 1929లో డ్యానిష్‌ శాస్త్రవేత్తలు హెన్రిక్‌ డ్యామ్‌, ఎడ్వర్డ్‌ డోయిసీ నన్ను కనిపెట్టారు. కొన్ని సంవత్సరాల పరిశోధనల తర్వాత నన్ను రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్‌గా తేల్చారు. తర్వాత ‘కె’ విటమిన్‌గా పేరు పెట్టారు. వీరికి 1943లో నోబెల్‌ బహుమతి లభించింది. విటమిన్లు లేకుండా మీ జీవితమే లేదు! మీరు ఇప్పటికే ఈ సంగతి తెలుసుకుని ఉంటారు. మీకు మరో తమాషా విషయం చెప్పనా..? విటమిన్లు..విటమిన్లు అని అంటుంటారు కదా! గ్రీకుభాషలో ‘విట’ అంటే జీవితం అని అర్థం.

ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

పాపం.. పసి పాపాయిలు!

నాగురించి మీరు పెద్దగా బెంగపడాల్సిన పనిలేదు. కానీ.. అప్పుడే పుట్టిన పసి పాపాయిల్లో మాత్రం నా లోపం ఉంటుంది. తల్లిపాలల్లో చాలా చాలా తక్కువ ఉంటాను. కాబట్టి వారికి పెద్దగా అందను. అందుకే వారికి వైద్యులు నన్ను ఇంజక్షన్‌ రూపంలో అందిస్తుంటారు. పసి పాపాయిలతో పాటు కాలేయ వ్యాధులతో బాధపడేవారిలో నా లోపం తలెత్తుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. పురుషులకు రోజుకు 120 మిల్లీగ్రాములు, స్త్రీలకు రోజుకు 90 మిల్లీగ్రాములు నేను దొరికితే చాలు.

ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

అన్నింట్లో నేనుంటా..

మీకో ఆసక్తికర విషయం చెప్పనా.. నేను దాదాపు అన్ని ఆహార పదార్థాల్లోనూ అంతో ఇంతో ఉంటాను. కాబట్టి మీకు పెద్దగా ఢోకా లేదు. నేను ఎక్కువగా ఆకుకూరలు, బచ్చలి, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, గోధుమ, పచ్చిబఠాణీల్లో చాలా ఎక్కువగా ఉంటాను. అంటే 100 గ్రాముల్లో దాదాపు 400 మిల్లీగ్రాముల నుంచి 700 మిల్లీగ్రాముల వరకు ఉంటాను. మాంసాహారం లోనూ నేను ఎంతో కొంత ఉంటాను.

ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

నాతో.. మీ ఎముకలెంతో బలం!

కొందరికి చిన్న చిన్న ప్రమాదాలకే ఎముకలు పుటుక్కున విరిగిపోతుంటాయి. అందరూ ఏమనుకుంటారు.. ‘పాపం వారిలో క్యాల్షియం తక్కువైందేమో.. అందుకే ఎముకలు వెంటనే విరిగాయి’ అనుకుంటారు. అది నిజమే.. కానీ ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియంతో పాటు నేనూ ఉండాలి. నేను మీ శరీరంలో తగినంత పరిమాణంలో ఉంటే.. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి.

ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

మేం కవలలం!

మీకో రహస్యం చెప్పనా.. ఇది చాలా మందికి తెలియదు. కె విటమిన్‌ ఒక్కటే అనుకుంటారు. నిజానికి మేం ఇద్దరం. కె1, కె2... అంటే ఓ రకంగా కవలలం అన్నమాట! మాలో పెద్దగా తేడా ఉండదు. ఒకే ఒక భేదం ఏంటంటే.. కె1 శాకాహారంలో లభిస్తే.. కె2 మాంసాహారంలో లభిస్తుంది. మాంసాహారం అలవాటు లేకపోయినా ఫర్వాలేదు. నేను ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాను కాబట్టి.. మీరు మారాం చేయకుండా తింటే సరి.

ఏ ఆహార పదార్థాల్లో కె విటమిన్​ ఉంటుంది?

మీ హృదయం పైనా దయ చూపుతా!!

గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టేలా చేయడం, ఎముకలు విరగకుండా చూడటమే కాదు... నేను మీ గుండెనూ ఆరోగ్యంగా ఉంచుతాను. ముఖ్యంగా హృదయానికి రక్తం సరఫరా చేసే ధమనులు గట్టిపడకుండా కంటికిరెప్పలా కాపాడతాను. మీ ధమనుల గోడలకు క్యాల్షియం పేరుకుపోకుండా చూస్తాను. శరీరానికి, గుండెకు రక్తసరఫరాలో అడ్డంకులు లేకుండా చేస్తాను. మీ శరీరంలో క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తుంటా. విటమిన్‌ ‘ఎ’తో పాటు నేనూ మీ కంటి ఆరోగ్యానికి సాయం చేస్తాను. వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాను. అధిక రక్తపోటునూ నియంత్రణలో ఉంచుతాను.

సరే ఫ్రెండ్స్‌.. ఉంటాను మరి.. మీరు మాత్రం పేచీ పెట్టకుండా.. అన్ని ఆహార పదార్థాలు తినండి.. హాయిగా ఆడుకోండి.. చక్కగా చదువుకోండి బై..బై..

ABOUT THE AUTHOR

...view details