తెలంగాణ

telangana

ETV Bharat / city

Mining: నిజం దాచేస్తున్నారు.. ఖనిజం దోచేస్తున్నారు

రాష్ట్రంలో మైనింగ్‌ ప్రాజెక్టులు, వాటికి పర్యావరణ అనుమతుల ప్రక్రియ యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు క్షేత్రస్థాయి ప్రభావాన్ని అంచనా వేయకుండానే మైనింగ్‌ ప్రాజెక్టులకు ఎడాపెడా పర్యావరణ అనుమతులు ఇస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

By

Published : Jun 16, 2022, 4:39 AM IST

Mining
Mining

రాష్ట్రంలో మైనింగ్‌ ప్రాజెక్టులు, వాటికి పర్యావరణ అనుమతుల ప్రక్రియ యథేచ్ఛగా పరుగులు తీస్తోంది. క్షేత్రస్థాయి వాస్తవిక పరిస్థితులు, పర్యావరణంపై ప్రభావాన్ని పక్కాగా అంచనా వేయకుండానే అధికారులు అనుమతులిచ్చేస్తున్నారు. అయిదు హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న మైనింగ్‌ క్వారీలకు నేరుగా అనుమతి వస్తుండగా, అయిదు హెక్టార్లకు పైబడిన వాటికి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నా.. అదీ తూతూమంత్రంగానే సాగుతోంది. ఈ విషయంలో లీజుదారు, కన్సల్టెంటే బాధ్యులు అవుతారని, మైనింగ్‌ ప్రభావాన్ని తక్కువచేసి చూపినా..నివాస, నీటి వనరులకు దూరం తగ్గించి చూపినా లీజు, కన్సలెంట్‌ గుర్తింపు రద్దవుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. అసలు పర్యవేక్షణే లేనప్పుడు అవకతవకలపై చర్యలు ఏముంటాయని ప్రజలు పేర్కొంటున్నారు.

ఇవిగో ఉదంతాలు:సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి, మంత్రికుంట, మాదారంలో 14 క్వారీలున్నాయి. వీటి ప్రభావ తీవ్రత అంచనా వేయడంలో నిర్లక్ష్యంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఓ క్వారీలోని పేలుళ్లలో అమ్మోనియా వాడుతుండటంతో దుమ్ము, రసాయనాల ఘాటు ఇబ్బందులకు గురిచేస్తోందని సమీప ఇళ్లవారు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

  • మాధారంలో ఓ క్వారీ పక్కనే బామ్మని చెరువు, సంఘం కుంట ఉన్నాయి. క్వారీలో దుమ్ము నీటివనరుల్లో చేరుతోందని రైతులు, గ్రామస్థులు వాపోతున్నారు.
  • కాజీపల్లిలో ఓ కంకర క్వారీలో పేలుళ్లు, రసాయనాల ఘాటుతో చుట్టుపక్కల ఇళ్లవారు ఉక్కిరికిబిక్కిరి అయ్యారు.
  • హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో తొమ్మిది క్వారీలున్నాయి. వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉండటంతో శబ్ద, వాయు కాలుష్యం..దుమ్ముతో వాహనదారులు అవస్థ పడుతున్నారు.
  • ఇదే జిల్లా ఎల్కతుర్తి మండంలో 35 గ్రానైట్‌ కటింగ్‌ మిషన్‌ యూనిట్లున్నాయి. పాలిష్‌ చేసిన గ్రానైట్‌ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. వచ్చిపోయే వాహనాల కాలుష్యంతో వందల ఎకరాల పంటలు దెబ్బతింటున్నాయి. ‘అనేకసార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలే్లేదని’ స్థానిక రైతు రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యాంశాలు

  • కలర్‌ గ్రానైట్‌ ఉమ్మడికరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో, కంకర క్వారీలు అన్ని జిల్లాల్లో, ఇసుక ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో, క్వార్ట్జ్‌, ఫెల్స్‌ఫార్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌, లైమ్‌స్టోన్‌ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1145 చోట్ల మైనింగ్‌కు అనుమతులు ఇవ్వగా, 450 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
  • 2022లో జనవరి-మే మధ్య ఇచ్చిన పర్యావరణ అనుమతులు: 180
  • ఇందులో మైనింగ్‌కు సంబంధించినవి: 69
  • మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు: 109
  • టీఓఆర్‌ ఇచ్చిన ప్రాజెక్టులు : 60 (అందులో మైనింగ్‌వి 15, మౌలిక సదుపాయాలవి 41) ఐదు హెక్టార్లు దాటినవాటికి ముందు టీఓఆర్‌(టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) ఇస్తారు. ప్రజాభిప్రాయసేకరణ తర్వాత పర్యావరణ అనుమతులు వస్తాయి.

    అనుమతుల ప్రక్రియలో ఏం జరగాలి?
  • నిబంధనల ప్రకారం మైనింగ్‌ జరిగే ప్రాంతం చెరువులు, కుంటలు వంటి నీటి వనరులకు 50 మీటర్లు, నివాస ప్రాంతానికి 200 మీటర్ల దూరం ఉండాలి. ఈ దూరం నిర్దేశించిన మేరకు ఉందా? లేదా? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించి లెక్కించాలి.
  • పర్యావరణంపై ఏమేరకు ప్రభావం పడుతుందన్న విషయాన్ని అంచనా వేయాలి.
  • అనుమతి ఇచ్చిన తర్వాత కూడా క్వారీల్లో యంత్రాల ఏర్పాటు ఎలా ఉంది? నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనేది చూడాలి.
  • మైనింగ్‌ సమయంలోనూ కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల్ని కఠినంగా అమలుచేస్తున్నారా? లేదా? అనేది విశ్లేషించాలి.
  • వాస్తవంగా అవేమీ జరగడం లేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో మైనింగ్‌కు పర్యావరణ అనుమతులు వస్తున్నాయి. తవ్వకాలు కొనసాగుతున్నాయి.

    ఏం జరుగుతోంది?:
  • అనుమతులు ఇచ్చే సమయంలో మైనింగ్‌దారు, అతని కన్సల్టెంట్‌ సమర్పించే పత్రాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా నివాస ప్రాంతాలు, నీటి వనరులకు తవ్వకాలతో నష్టం వాటిల్లకుండా చూసే నిర్దిష్ట దూరం నిబంధన అమలుకు అనుసరిస్తున్న విధానమే లోపభూయిష్టంగాఉంది.గూగుల్‌ మ్యాప్‌లను ఆధారంగా..ఆ దూరాన్ని లెక్కించి అనుమతులిస్తున్నారనే విమర్శలున్నాయి.
  • * నాలుగు గోడల మధ్య జరిగే సమావేశాల్లోనే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మే నెలలో రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావం అంచనాల ప్రాధికార సంస్థ(స్టేట్‌ లెవల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంప్యాక్ట్‌ అసెస్‌మెంట్‌ అథారిటీ, ఎస్‌ఈఐఏఏ) ఐదుసార్లు సమావేశమైంది. వివిధ రకాలవి కలిపి 122 మైనింగ్‌ సంబంధించిన దరఖాస్తులు పరిశీలించి, కేవలం ఏడింటిని తిరస్కరించింది. అంటే మిగిలిన వాటిలో సింహభాగానికి పర్యావరణ అనుమతులు లభించాయి.

రాస్తారోకోలు చేసినా పట్టించుకోరా? :ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారంలో నాలుగు క్వారీలున్నాయి. మట్టి, రాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా జరిగే పేలుళ్లతో రాళ్లు ఎగిరొచ్చి పంట చేలల్లో పడుతున్నాయి. నరసింహారావుపేట, గార్లఒడ్డు గ్రామాల్లో ఇళ్లు బీటలు వారుతున్నాయి. నరసింహారావుపేట ప్రజలు పేలుళ్లను నిరసిస్తూ రాస్తారోకోలూ చేశారు. మైనింగ్‌శాఖగానీ, కాలుష్య నియంత్రణ మండలిగానీ ఇటువైపు కన్నెత్తి చూడలేదని స్థానికులు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details