సీఎం కేసీఆర్ అరిష్ట పాలనకు చరమగీతం పాడతామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 2023లో తెరాస పార్టీని ప్రజలు పాతరేస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణతో భాజపా మాత్రమే గెలుస్తుందని.. కాషాయ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఉపఎన్నికకు అధికార పార్టీ ఏకంగా రూ.500 కోట్లు ఖర్చు చేసిందని ఈటల ఆరోపించారు.
ఘనంగా సన్మానం..
హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఈటలకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా బయలుదేరిన ఈటల రాజేందర్ మొదట.. గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. శామీర్‌పేట్ నుంచి గన్‌పార్క్ వరకు ఈటల విజయోత్సవ ర్యాలీ సాగింది. అనంతరం కార్యాలయానికి చేరుకున్న ఈటలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్.. ఘనంగా సన్మానించారు.
ఈ విజయం ప్రజలదే..
"నా ఈ విజయం హుజూరాబాద్ ప్రజలు, యువతదే. ముంబయి, దుబాయ్ నుంచి ఫోన్లు చేసి మరీ ఓటేయించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసి గెలిపించారు. అధికార యంత్రాంగం అంతా సీఎం కేసీఆర్ ఒత్తిడికి లొంగి పనిచేసింది. తెరాస కండువా కప్పుకుంటేనే పనులవుతాయని ప్రజలను పోలీసులు బెదిరించారు. పోలీసులు, అధికారులు జీతాలు తీసుకునేది ప్రజల డబ్బన్న సంగతి మరవద్దు. పదోన్నతులకు ఆశపడి అధికారులు చేసిన పనులు చూసి ప్రజలు తలదించుకుంటున్నారు.సీఎం కేసీఆర్ దళితబంధు పాత ఆలోచన అని చెబుతున్నారు. పాత ఆలోచనైతే హుజూరాబాద్ ఎన్నిక వరకూ ఎందుకు ఆగారు..? కేసీఆర్‌కు అధికారం తాత, తండ్రుల నుంచి రాలేదు. దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాల్సిందే. 20 ఏళ్లు పాలించమని ప్రజలు కేసీఆర్‌కు అధికారమివ్వలేదు. ప్రజలు కేసీఆర్‌కు 2023 వరకే అధికారం ఇచ్చారు. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే కొత్త పథకాలు గుర్తుకొస్తాయి. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఒక్క ఎస్సీ కుటుంబమైనా బాగు పడిందా..? రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటా. ఐటీ హబ్‌తో హైదరాబాద్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు..? తెరాస మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయడం లేదు."-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇదీ చూడండి: