హైదరాబాద్ మెట్రోరైలు చాలా రోజుల తర్వాత ప్రయాణికులతో కళకళలాడింది. రాఖీ పండగ కావడంతో ఆదివారం కిక్కిరిసిపోయింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు సోదరి, తోబుట్టువు ఇంటికి వెళ్లేందుకు సోదరులు.. మెట్రోని ఎంచుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కన్పించింది.
ప్రత్యేకించి మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, నాగోల్ నుంచి రాయదుర్గం మార్గాల్లో ప్రతి ట్రిప్పులోనూ ప్రయాణికులు భారీగా రాకపోకలు సాగించారు. ప్రారంభ స్టేషన్లు నాగోల్, ఉప్పల్, మియాపూర్, ఎల్‌బీనగర్‌లోనే మెట్రో సీట్లు నిండిపోయేవి. ఆ తర్వాత ఎక్కిన వారంతా నిలబడే ప్రయాణించాల్సి వచ్చింది. ఆదివారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల వరకు ప్రయాణించి ఉంటారని అంచనా. కొవిడ్ తర్వాత ఇదే అత్యధిక ప్రయాణికుల సంఖ్య.