తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC Medicine Scam: ఆర్టీసీలో అక్రమాలు.. ఏళ్ల తరబడి ఒకే సంస్థకు మందుల సరఫరా బాధ్యత! - medicine scam in telangana rtc

TSRTC Medicine Scam: ఆర్టీసీలో మందుల కొనుగోలు నుంచి పంపిణీ వరకు భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఒకే సంస్ఖకు మందుల సరఫరా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీలో మందుల మాయాజాలం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.

TSRTC Medicine Scam
TSRTC Medicine Scam

By

Published : Jan 2, 2022, 9:12 AM IST

TSRTC Medicine Scam: ఆర్టీసీలో మందుల కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకొంటున్నాయి. ఏటా రూ.8 కోట్లకు పైగా మందుల కోసం ఖర్చు చేస్తుండగా, కొనుగోలు నుంచి పంపిణీ వరకు భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఆర్టీసీలో ఓ రకం మందుల సరఫరాకు ముందుగా ఓ సంస్థ కొటేషన్‌ దాఖలు చేసింది. అంతకు ముందు సంవత్సరం కూడా ఆ సంస్థ మాత్రమే కొటేషన్‌ ఇచ్చింది. కొంతకాలంగా ఇదంతా ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి గడువు ముగిసే సమయంలో మరో సంస్థ కొటేషన్‌ దాఖలు చేసింది. మొదటి సంస్థకు ఈ విషయం తెలిసి ముందు పేర్కొన్న ధర కంటే భారీగా తగ్గించి మరో కొటేషన్‌ ఇచ్చింది. దాంతో అది ఎల్‌-1గా నిలిచింది. రెండో సంస్థ ఎల్‌-2గా వచ్చింది. అయితే మొదట దాఖలైన కొటేషన్‌లో ఎల్‌-2గా వచ్చిన సంస్థ పేర్కొన్న ధర కంటే ఎక్కువగా ఉంది. పాత సంస్థకే మళ్లీ దక్కేలా చేయడానికి కొందరు అధికారులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. రెండో సంస్థ పోటీకి రాకుంటే ఆర్టీసీకి మరింత ఆర్థిక భారం పడేది. మరో మందు కొనుగోలులోనూ ఇలాగే జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.

మూడేళ్లుగా..

Medicine Supply to TSRTC Employees : గతంలో ఆర్టీసీకి ప్రైవేటు సంస్థ మందులు సరఫరా చేసేది. ఇందులో గోల్‌మాల్‌ జరుగుతుండటం, భారం ఎక్కువగా పడుతుండటంతో ఆర్టీసీనే మందుల డీలర్ల నుంచి కొటేషన్లు తీసుకొని తక్కువ ధరకు వచ్చిన వారి నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించింది. 2017-18లో సరాసరిన నెలకు రూ.కోటి 25 లక్షలను మందులకు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ.15 కోట్లు. 2018-19లో సరాసరిన నెలకు రూ.74.61 లక్షలు కాగా, 2019-20లో రూ.68.20 లక్షలైంది. ఆర్టీసీ కొటేషన్లు తీసుకొని చేయడం వల్ల వ్యయం కొంత తగ్గింది. అయినప్పటికీ రూ.ఎనిమిది కోట్లకు పైగా ఉంది. మొత్తం 439 రకాల మందులను ఆర్టీసీ కొనుగోలు చేస్తుండగా, ఇందులో యాభై శాతానికి పైగా మందులు చక్కెరవ్యాధికి సంబంధించినవే ఉంటున్నాయి. ప్రధానంగా రెండు సంస్థల నుంచే వీటిని కొంటున్నారు.

మూడేళ్లుగా ఇవే సింగిల్‌ కొటేషన్‌ దాఖలు చేసి ఆర్డర్లు తీసుకొంటున్నాయి. ఒకరు కొటేషన్‌ ఇచ్చినదానికి ఇంకొకరు వేయకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పుడేం జరిగింది?

Purchase of medicines in TSRTC : తాజాగా కొటేషన్‌ దాఖలుకు నవంబరు 18 ఆఖరు తేదీ కాగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్లను యూనిట్‌కు రూ.687.96 చొప్పున ఇస్తామని ఓ డిస్టిబ్య్రూటరీ సంస్థ కోట్‌ చేసింది. అయితే చివరి నిమిషంలో మరో సంస్థ రూ.632.94 ధర కోట్‌ చేసింది. దీంతో మొదట దాఖలు చేసిన, అంతకుముందు కొన్నేళ్లు సింగిల్‌ కొటేషన్‌తో మందుల సరఫరా దక్కించుకొన్న సంస్థ తమకు కాంట్రాక్టు దక్కే అవకాశం లేకపోవడంతో రూ.509.04తో మరో కొటేషన్‌ ఇచ్చింది. ఇదంతా ఆర్టీసీ అధికారుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఒక సంస్థ ఒకే రోజు వేర్వేరు ధరలతో ఇచ్చిన కొటేషన్లను అంగీకరించి, రూ.509.04 ధరతో ఇచ్చిన కొటేషన్‌ను ఎల్‌-1గా నిర్ణయించారు. పోటీ రాకుండా ఉంటే రూ.687.96 ధర ఖరారయ్యేది. 2019లో రూ.409.5తో, 2020లో రూ.450.45తో సరఫరా చేసింది. మరో మందు సరఫరాకు కూడా ఇంకో సంస్థ వేర్వేరు ధరలతో ఒకే రోజు రెండు కొటేషన్లు ఇచ్చింది. ఒక కొటేషన్‌ రూ.262.50తో ఇచ్చింది. ఇంకో సంస్థ రూ.121.96కి కొటేషన్‌ ఇవ్వడంతో మొదట ఎక్కువకు ఇచ్చిన సంస్థ మళ్లీ రూ.108.50 పేర్కొంటూ దాఖలు చేసింది. అడిగిన పరిమాణంలో ఒక మందు సరఫరాకు మొదటి కోట్‌ ప్రకారం మొత్తం విలువ రూ.12.60 లక్షలైతే, రెండో సంస్థ రూ.5.85 లక్షలకు కోట్‌ చేసింది. దాంతో మొదటి సంస్థ రెండోసారి రూ.5.20 లక్షలకే సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. ఇక్కడ కూడా ఈ సంస్థ ఇచ్చిన రెండు కొటేషన్లను అధికారులు ఆమోదించారు. మొత్తంమీద ఆర్టీసీలో మందుల మాయాజాలం చర్చనీయాంశంగా మారింది.

ఇదీచూడండి:గర్భనిరోధక పద్ధతుల వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయా?

ABOUT THE AUTHOR

...view details