హొయసలుల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది వారి శిల్పకళ. బేలూరు, హళేబీడు తదితర ప్రాంతాల్లో ఈ రాజులు నిర్మించిన ఆలయాలు చూపుతిప్పుకోనివ్వవు. హొయసల రాజు విష్ణువర్ధనుడి పాలనా కాలంలో క్రీ.శ.1114లో దొడ్డగద్దవళ్లి లక్ష్మీదేవి ఆలయం నిర్మితమైంది. ఈ రాజుల తొలి రోజుల్లో కట్టిన కోవెలల్లో ఇదే మొదటిదని చెబుతారు. నిర్మాణంలో సబ్బురాయి (సోప్ స్టోన్) ఉపయోగించారు. మహాలక్ష్మి, మహాకాళి, భూతనాథ (శివ), విష్ణువులతో కూడిన చతుష్కూట ఆలయమిది. వజ్రాల వ్యాపారి కుళ్లన్న రవుత్, తన భార్య సహజాదేవితో కలిసి దీన్ని కట్టించినట్టు ఒక ఐతిహ్యం. ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం విశ్వకర్మ సుభాషిత అని ఖ్యాతి పొందిన మల్లోజ మాణ్యోజ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది.
శాంత మూర్తులు
తొమ్మిది శిఖరాలు, నాలుగు గోపురాలు ఉన్న ఈ ఆలయంలో లక్ష్మిగుడి శిఖరం చాళుక్య శైలిలో, మిగిలినవి కదంబనాగర శైలిలో ఉంటాయి. ఇలాంటి వైవిధ్యం మరెక్కడా కనిపించదు. తొమ్మిది శిఖరాల మీద కలశాలను రాతితో చెక్కారు. గోపురాల మీద హొయసల రాజ లాంఛనం ‘పులిని పొడుస్తున్న సాల’ శిల్పాల్ని అందంగా మలచారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు గద, చక్రం, శంఖం ధరించి నిల్చుని ఉంటుంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మహాలక్ష్మి విగ్రహమూ ఇలాగే ఉంటుంది. అందుకే దొడ్డగద్దవళ్లిని అభినవ కొల్హాపూర్/ దక్షిణ కొల్హాపూర్ అంటారు.
ఈ ఆలయంలో కాళీమాత కూడా శాంత రూపంలో శంభోనిశంభ అనే రాక్షసుణ్ని సంహరిస్తున్నట్టు ఉంటుంది. నుదుటి మీద శ్రీచక్రంతో విల్లు, బాణం, త్రిశూలం, ఖడ్గం, డమరుకం, యమపాశం ధరించి దర్శనమి స్తుంది. అమ్మవారు ఉగ్రరూపం పొందిన ప్పుడు శాంతింపజేయడానికి ఎదురుగా విష్ణువుని, అలాగే భూతనాథుణ్ని శాంతింప జేయడానికి ఎదురుగా లక్ష్మిని ప్రతిష్ఠించారట. అన్నా చెల్లెళ్లు ఇలా ఎదురెదురుగా ఉన్న వాస్తు వైవిధ్యం దేశంలో మరెక్కడా లేదు. మహాకాళి గర్భగుడి బయట ఏడు అడుగుల ఎత్తులో భేతాళుల్ని ద్వారపాలకులుగా చెక్కారు. నగ్న స్వరూపంలో నాలుకలు బయటికి చాచి, కుడిచేతిలో కత్తి, ఎడమ చేతిలో ఖండించిన రాక్షసుడి తలతో ఉంటాయీ విగ్రహాలు. శాఖినీ, ఢాకినీ శిరస్సులు, వాటి ఎదుట భేతాళుల నాట్యాలు, రుద్రవీణ వాయిస్తున్న భేతాళ విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు.
కాళీమాత ఎదురుగా చిన్న నవరంగ నాట్య మండపమూ ఉంటుంది. మాత రౌద్రరూపం పొందినప్పుడు ఆమెని శాంతింపజేయడానికి విష్ణువర్ధనుడి రాణి శాంతలాదేవి స్వయంగా ఇక్కడ నాట్యం చేసేదట. రుద్రవీణ వాయిస్తున్న శివుడు, విల్లు, బాణం, త్రిశూలం, డమరుకం, మృదంగం ధరించి నాట్యం చేస్తున్న నటరాజు, నంది మీద శివుడు, పార్వతి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. అష్టదిక్పాలకులు వారి వాహనాల మీద భార్యలతో సహా ఇక్కడ కనిపిస్తారు. 40 ఏళ్ల కిందట మూల విష్ణువు విగ్రహం చోరీకి గురవ్వడంతో ప్రస్తుతం కాలభైరవ మూర్తిని ప్రతిష్ఠించారు.
కేంద్ర ప్రభుత్వం 1958లో ఈ ఆలయాన్ని జాతీయ స్మారకంగా ప్రకటించింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తెరచి ఉండే ఈ ఆలయం హసన్‌కు దాదాపు 20 కిలోమీటర్లు, మైసూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి హళేబీడు 15, బేలూరు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.