ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వ్యర్థాల తాకిడి తగ్గడం లేదు. ఇప్పటికే హుస్సేన్ సాగర్‌లోకి వచ్చే నాలాలు వేరే వైపు మళ్లించారు. వ్యర్థ జలాలు, చెత్త సాగర్‌లో చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు ప్రత్యేక యంత్రాలతో శుభ్రం చేస్తున్నారు. అయితే.. దుర్గంధం మాత్రం తగ్గడం లేదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టడానికి హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనులు మొదలుపెట్టిన అధికారులు.. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు డెన్మార్క్ నుంచి ప్రత్యేకమైన అధునాతన యంత్రాలు తెప్పించి వ్యర్థాల తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టారు.
పైలట్ ప్రాజెక్టుగా మొదలు
హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాల తొలగింపు అంశమై.. ఇటీవల ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీ వేసింది. ప్రతిఏటా కోట్లు ఖర్చు చేసినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగర్‌లోకి ప్రస్తుతం వస్తున్న నీటి వ్యర్థ్యాలను కట్టడి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. హుస్సేస్ సాగర్ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నీటివ్యర్థాలు జలాశయంలోకి చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రంగంలో అనుభవమున్న డెన్మార్క్‌కి చెందిన చెందిన కంపెనీ డెస్మితో హెచ్ఎండీఏ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా తొమ్మిది నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు నిర్వహణకు డెన్మార్క్ సంస్థ అంగీకారం తెలిపింది. వచ్చే రెండు నెలల కాలంలో పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను హుస్సెన్ సాగర్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు యంత్రాలను ట్యాంక్‌బండ్‌లో పరీక్షించారు.