History and Culture of Lord Ganesh : సమస్త ప్రకృతిలో చరాచరాత్మక సృష్టిని ఎవరు నిర్వహిస్తున్నారో ఆ పరమేశ్వర చైతన్యమే- గణపతి. రూప జగత్తుకు, శబ్ద ప్రపంచానికి గణపతే అధిపతి అని వేదం ప్రకటించింది. ఏ రూపమూ లేని పరబ్రహ్మకు ఆకృతి లభిస్తే ఆ రూపం గణేశుడిగా తేజరిల్లుతుందని ఉపనిషత్తు వాక్కు. గణేశుడిని సూచించే ‘గ’కారమే మంత్ర బీజాక్షరం. సకల దేవతల చేత పూజలందుకొనే గణపతిని వేదం ‘బ్రహ్మణ స్పతి’గా ప్రస్తావించింది. ‘గణం’ అంటే సమూహం. అనేక గణాల మేలు కలయిక అయిన ఈ సృష్టిని నడిపే లోక నాయకుడు గణాధిపుడు! ‘ఓం’కారంలో గణపతి రూపాన్ని దర్శించి, సృష్టి రచనాదక్షతను బ్రహ్మ పొందాడంటారు. అ, ఉ, మ- అనే మూడు అక్షరాల సమ్మిళితమైన ఓంకారాన్ని ఆశ్రయించి గణపతి వెలుగొందుతున్నాడని ముద్గల పురాణం విశ్లేషించింది. ఈ మూడు అక్షరాలు సృష్టి, స్థితి, లయ అనే ప్రక్రియను- జాగృత, స్వప్న, సుషుప్తి అనే అవస్థలను సంకేతిస్తాయి.
శక్తి, యుక్తి, ఐశ్వర్యం, ఆనందం- అనే నాలుగు అంశాల పరిపూర్ణ తత్త్వమే- గణపతి రూపం. గణేశుడి ఏనుగు ముఖం శక్తికి, బలానికి సూచిక. ఆనందమే గణేశుడి రూపం అని శ్రీవిద్యార్ణవ తంత్రం పేర్కొంది. మోదః అంటే ఆనందం. ఆనందకారకమైన మోద కాలను ఆహారంగా శివబాలుడు స్వీకరించి, వాటినే తన భక్తులకు అనుగ్రహ ఫలాలుగా అందిస్తాడు. ప్రకృతీపురుష అభేదాత్మకః గణేశః అని గణేశ పురాణోక్తి. ప్రకృతి ఆకృతే గణపతి. విశ్వమంతా రూపొందక ముందు, నిర్గుణ పరబ్రహ్మగా ఉన్న అవ్యక్త రూపమే- గణపతిగా ఆవిష్కృ తమైంది. ఒక్కటిగా ఉన్నప్పుడు అన్నీ ఆ స్వరూపంలో ఉన్నాయి. విడివడి ప్రపంచంగా రూపాంతరం చెందినప్పుడు అనేక దేవతా శక్తులుగా, గణాలుగా వ్యక్తమయ్యాయి. వేద సంప్రదాయం ప్రకారం మూడు ముఖ్య గణాలున్నాయి. అవి భూమి, అంతరిక్షం, దివి. ఈ మూడు గణాలు గణపతి అధీనంలోనే ఉంటాయి.