హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై వాదనలు ముగిసాయి. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం సుమారు 75 శాతం బస్సులు నడుస్తున్నాయని, త్వరలో మిగతా బస్సులు పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిపోతే... విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 4వేల బస్సులు నడవడం లేదని... ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి 4 వేల బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రశ్నించింది.
సమ్మె ప్రారంభమయ్యాక ప్రభుత్వం తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయం ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రకటనలు సమస్యను మరింత క్లిష్టం చేసేలా ఉన్నాయే కానీ... పరిష్కరించేలా లేవని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
విలీనం చేస్తే మిగితా కార్పోరేషన్లు డిమాండ్ చేస్తాయి: ప్రభుత్వం
ఆర్టీసీ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ఒకవేళ ఆర్టీసీని విలీనం చేస్తే... మిగతా కార్పొరేషన్లు కూడా డిమాండ్ చేస్తాయని తెలిపింది.