రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జాన్వాడ మీర్జాగూడలో జీవో 111కు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసిన కేసులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ఊరట లభించింది. ఎన్జీటీ నోటీసులు జారీ చేయడంతో పాటు సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి కేటీఆర్‌తో పాటు ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి వేర్వేరుగా వేసిన పిటిషన్‌లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఫామ్‌హౌస్ నిర్మాణంపై ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
జీవో 111కు విరుద్దగా మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన ఎన్జీటీ 2020 జూన్ 5న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేస్తూ.. పరిశీలించడానికి సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి కేటీఆర్, ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లపై ఫిబ్రవరిలో సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. దీనిపై బుధవారం( ఏప్రిల్ 27న) తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీలో పిటిషన్ విచారణార్హం కాదని తేల్చి చెప్పింది.