' ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే... భూములు వెనక్కి తీసుకోండి' - ప్రైవేటు ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం
12:10 August 05
'అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఆస్పత్రుల భూములు వెనక్కి తీసుకోండి'
కార్పొరేట్ ఆస్పత్రులు షరతులు ఉల్లంఘిస్తే.. ప్రభుత్వం కేటాయించిన భూములను ఎందుకు వెనక్కి తీసుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలపై ఉన్నత న్యాయస్థానం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రులు ప్రభుత్వం విధించిన షరతులు పాటించడం లేదంటూ విశ్రాంత ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఉచిత వైద్యం అందించడం లేదు
పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో.. అపోలో, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రులకు హైదరాబాద్లో విలువైన భూములను రాయితీ ధరకు ప్రభుత్వం కేటాయించిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో 15 నుంచి 25 శాతం పడకలు పేదలకు కేటాయించాలని.. ఓపీలో 40 శాతం పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని జీవోలో ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు తెలిపారు. అయితే అపోలో, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించడం లేదన్నారు. కాబట్టి ఆ రెండు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని.. షరతుల ప్రకారం పేదలకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
13లోగా వివరణ ఇవ్వాలి
స్పందించిన ధర్మాసనం షరతులకు కట్టుబడి ఉండని ఆస్పత్రులకు కేటాయించిన భూములను ఎందుకు వెనక్కి తీసుకోరాదని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య సేవల కోసం ఎందుకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక ఛార్జీలు చెల్లించకపోతే మృతదేహాన్ని కూడా బంధువులకు అప్పగించడం లేదని విస్మయం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించని ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. వాటికి కేటాయించిన భూములను కూడా వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రులపై పిటిషన్లో ప్రస్తావించిన అంశాలపై ఈ నెల 13లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.