ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదని హైకోర్టు హెచ్చరించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట్ సర్పంచ్ జి.కుమారస్వామి... వాస్తవాలు దాచిపెట్టి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కుమారస్వామికి రూ. 50 వేల జరిమానా విధించింది. లక్ష్మిదేవిపేట్ గ్రామస్థులపై వెంకటాపురం ఎస్సై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని కుమారస్వామి దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
లక్ష్మీదేవిపేట్ సర్పంచ్‌పై హైకోర్టు ఆగ్రహం.. 50 వేల జరిమానా - high court latest hearings
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట్ సర్పంచ్ జి.కుమారస్వామిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్‌కి రూ. 50 వేల జరిమానా విధించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేశారని మండిపడింది.
డీజీపీకి వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందించడం లేదని.. గ్రామస్తులపై నమోదు చేసిన కేసులను కొట్టివేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. తనపై కూడా కేసు నమోదైందన్న విషయాన్ని అఫిడవిట్లో ఎందుకు ప్రస్తావించలేదని ఉన్నత న్యాయస్థానం సర్పంచ్‌ను నిలదీసింది. తనపై ఎలాంటి క్రిమినల్, సివిల్ కేసులు లేవని అఫిడవిట్లో పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది.
క్షమాపణ చెప్పి పిల్ వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. యాభై వేల రూపాయల జరిమానాను హైకోర్టు న్యాయ సేవాధికార కమిటీకి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీచూడండి: అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం
TAGGED:
high court latest hearings