ఎండ పెరుగుతోంది. మిట్ట మధ్యాహ్నం బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. రాత్రిళ్లు తేమ తగ్గిపోతుండటంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడటం ప్రారంభమైంది. ఈ ఏడాది వేసవి మరింత మండనుందని పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. బుధవారం భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల 40.2 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కన్నా 2 డిగ్రీల వరకూ అదనంగా పెరిగింది. ఈ నెల 1న పెద్దపల్లి జిల్లా మంథనిలో 39.8 డిగ్రీలు.. ఇదే జిల్లా శ్రీరాంపూర్, ఖమ్మం జిల్లా మధిర, కూసుమంచిలలో గరిష్ఠంగా 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 37 డిగ్రీలు దాటితే వడదెబ్బ ముప్పు పొంచి ఉన్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు పిడుగుపాట్లు కూడా తెలంగాణలో ఎక్కువగా సంభవిస్తాయి. వేడి కారణంగా గాలి అస్థిరమై క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, పిడుగులతో వర్షం, వడగళ్లు పడుతుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కన్నా 0.5 నుంచి ఒక డిగ్రీ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సూచించింది. ఉపాధి హామీ పనుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలో ఏటా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధికంగా 2015లో 540 మంది, 2016లో 324, 2017లో 108 మంది మృత్యువాత పడ్డారు.
ప్రమాదం మన చుట్టూ ఉన్నట్లే