వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం... ముసాయిదా బిల్లు సిద్ధం చేస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విశ్రాంత అధికారులు, రెవెన్యూ సంఘాలు, న్యాయనిపుణులతో... ఈ విషయంపై కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా చర్చిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం, ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఉదంతాల నేపథ్యంలో... పటిష్ఠ చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
అవసరమైనవే చట్టంలో..
ప్రధానంగా భూములు సంబంధిత వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులకు ఉన్న విచక్షణాధికారాలు... అవినీతి, అక్రమాలకు ప్రధాన కారణాలుగా గుర్తించారు. దీంతో విచక్షణాధికారాలు లేకుండా, వీలైనంత వరకు మానవ ప్రమేయం లేకుండా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలు సేవలు పొందేలా రూపొందించనున్నారు. ప్రజలకు అందించే సేవలను సత్వరమే, నిర్ణీత గడువులోగా ఆన్లైన్ విధానంలో అందించేలా నిబంధనలు పొందుపరచనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సంక్లిష్ట చట్టాలు, ప్రస్తుతానికి అవసరం లేని చట్టాలు, నిబంధనలను తొలగించి అవసరం ఉన్న వాటిని మాత్రమే చట్టంలో పొందుపరుస్తున్నారు.
వివాదాలకు తావులేకుండా..
నిర్ణీత గడువులోగా సేవలు అందించని అధికారులపై చర్యలతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపైనా, తప్పులు చేసిన వారిపైనా చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మ్యూటేషన్, వారసత్వ బదిలీ లాంటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా నిబంధనలు పొందుపరచనున్నారు. ప్రభుత్వ, అటవీ భూములను పూర్తి స్థాయిలో పరిరక్షించేలా నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు. అన్ని భూ సమస్యలు, వివాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేలా భూముల సమగ్ర సర్వే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్ట సమాచారం.
వీఆర్వో వ్యవస్థ రద్దు..
రెవెన్యూ వ్యవస్థలో భారీ స్థాయిలో సంస్కరణలకు సిద్ధమైన సర్కార్... వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారిని ఇతర శాఖల్లో విలీనం చేసి... వీఆర్ఏలను మాత్రం కొనసాగిస్తారని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ మొదలు కింది వరకు హోదాల పేర్లు కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్టర్ హోదాకు బదులుగా జిల్లా అడ్మినిస్ట్రేటర్ లేదా ఇతర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి విస్తృత చర్చ జరపాలని భావిస్తున్నారు. సభలోని సభ్యులందరూ రెవెన్యూ బిల్లుపై జరిగే చర్చలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి:70% కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే