ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో.. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. శ్రీశైలానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. నాగార్జున సాగర్‌కూ వరద ప్రవాహం కొనసాగుతోంది.
heavy inflow to telangana Krishna projects from upper areas
By
Published : Jul 24, 2021, 7:49 PM IST
|
Updated : Jul 25, 2021, 7:08 AM IST
ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 316.55 మీటర్లకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 3.75 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 3,76,027 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 18,360 క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తోంది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ ఏడాది మొదటిసారి నదిలో ప్రవాహం మూడున్నర లక్షల క్యూసెక్కులను దాటింది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నిల్వ 93.58 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి మట్టం 885 అడుగులకుగాను 855.60 అడుగుల వద్ద ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లో 10 టీఎంసీల నిల్వ పెరిగింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రానికి 12 గంటల వ్యవధిలో 8.74 టీఎంసీల నిల్వ పెరిగింది. 36 గంటల్లో ఎనిమిది అడుగుల మట్టం పెరిగింది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గంట గంటకు నిల్వ సామర్థ్యం మారుతోంది. తెలంగాణ జల విద్యుత్ కేంద్రం నుంచి 25,427 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.
శ్రీశైలం జలాశయంలో నిల్వ ఆదివారం ఉదయం నాటికి 100 టీఎంసీలను మించుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల నుంచి 3.72 లక్షల క్యూసెక్కులకు వరద విడుదలవుతోంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి కూడా సుమారు మూడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వస్తోంది. కర్ణాటకలో ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదుల నుంచి కృష్ణా నదికి ప్రవాహం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆలమట్టి, నారాయణపూర్‌లలో నీటిమట్టాన్ని ఆ రాష్ట్ర అధికారులు తగ్గించారు. ఆలమట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగాను 10.51 అడుగులు తగ్గించి 1694.49 అడుగుల వద్ద మట్టాన్ని కొనసాగిస్తున్నారు. నారాయణపూర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగాను 8.24 అడుగులు తగ్గించి 1606.76 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తున్నారు. వచ్చిన వరదను వచ్చినట్లే జూరాల వైపు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలో 1045 అడుగుల పూర్తిస్థాయి మట్టానికిగాను 5.83 అడుగులు తగ్గించి 1039.17 అడుగుల వద్ద నిల్వ ఉంచి వరదను వదులుతున్నారు.
సాగర్‌కు కొనసాగుతోన్న వరద...
నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 24,082 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 4,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం గరిష్ఠ సామర్థ్యం 590 అడుగులకు గాను 536.4 అడుగుల మేర నీరు ఉంది. 312.04 టీఎంసీల పూర్తి నీటి నిల్వకు గాను 180.91 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టుకు 26,550 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. రెండు గేట్ల ద్వారా 42,115 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.