తెలంగాణ

telangana

ETV Bharat / city

Heart Transplantation: మృత్యువు కమ్మేసినా కర్తవ్యాన్ని మరవని కానిస్టేబుల్​ గుండె.. పెయింటర్​కు ప్రాణదానం - Heart Transplantation operation success

heart-transplantation-operation-success-after-5-hours-of-doctors-struggle
heart-transplantation-operation-success-after-5-hours-of-doctors-struggle

By

Published : Sep 15, 2021, 7:26 PM IST

Updated : Sep 15, 2021, 10:48 PM IST

19:23 September 15

Heart Transplantation: 5 గంటల పాటు సాగిన ఆపరేషన్​.. గుండె మార్పిడి విజయవంతం

మృత్యువు కమ్మేసినా కర్తవ్యాన్ని మరవని కానిస్టేబుల్​ గుండె.. పెయింటర్​కు ప్రాణదానం

"చావు ఎదురుగా నిలబడ్డా.. కొంచెం కూడా బెదరకుండా పోరాడింది ఏం గుండెరా వాంది. ప్రజలను రక్షించే వృత్తిలో ఉండి.. దేహమంతా నిస్తేజంగా పడి ఉన్నా కర్తవ్యాన్ని మరవకుండా... ఇంకో ప్రాణాన్ని కాపాడిందంటే అదిరా గుండె అంటే. తమ కుటుంబంలో విషాదం నిండుతుందని తెలిసినా.. మరొకరి ఇంట్లో వెలుగులు నింపేందుకు ఒప్పుకున్న ఆ మానవతామూర్తులది ఎంత గొప్ప మనసురా."--- వీరబాబు, అతడి కుటుంబం గురించి అందరూ అనుకుంటున్న మాటలివి.

స్పందించే హృదయానికే ఎదుటి వారికి సాయపడాలన్న తపన ఉంటుంది. తన హృదయాన్ని మరొకరికి దానం చేసి... మరణంలోనూ ఆదర్శంగా నిలిచాడు వీరబాబు. ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన 34 ఏళ్ల వీరబాబు... కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్​లో పోలీస్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నారు. ఈ నెల 12న కూసుమంచికి వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండగా... గొల్లగూడెం వద్ద వీరబాబును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరబాబుకి తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం మలక్​పేట యశోదాకు తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం నిన్న వీరబాబుని జీవన్మృుతుడిగా వైద్యులు ప్రకటించారు. ఈ వార్త విని శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు.. వైద్యులు అవయవమార్పిడి గురించి వివరించారు. వైద్యుల మాటలు విన్న కుటుంబం.. వీరబాబు తమ మధ్య భౌతికంగా లేకపోయినా... వేరేవాళ్లలో బతికే ఉంటాడన్న మాటతో ఒప్పుకున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ప్రాణాల కోసం యుద్ధం చేసి అలసిన వీరబాబు దేహం నుంచి.. గుండెను దానం చేసేందుకు ఒప్పుకుని.. మరో కుటుంబంలో కొత్త కాంతులు విరిసేలా చేశారు. 

ఓ ఇంట విషాదం.. మరో ఇంట వెలుగు..

వీరబాబు మృతి ఘటనలో ఓ ఇంట విషాదం నిండగా... మరో ఇంట చిరునవ్వులు చిగురిస్తున్నాయి. నిండా ముప్పై ఏళ్లు లేని ఓ పెయింటర్ అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేసిన వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. చిన్నవయసు... పేదరికం.. ఇద్దరు పిల్లలు... రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. గుండె మార్పిడి కోసం జీవన్​దాన్​లో రిజిస్టర్ చేసుకున్నా... దాత ఎప్పటికి దొరికేనో తెలియని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో జీవన్​దాన్​లో రిజిస్టర్ చేసుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాలని నిర్ణయించుకున్న వారికి... ఓ శుభవార్త అందింది. ఆ కుటుంబం కాస్త కుదుటపడింది.

కేవలం 12 నిమిషాల్లో...

గుండెను యశోదా నుంచి నిమ్స్​కు తరలించేందుకు ఎలాంటి అవరోధం కలగకుండా... పోలీసులు గ్రీన్​ఛానల్​ ఏర్పాటు చేశారు. మలక్​పేట యశోదాలో వీరబాబు నుంచి గుండెను సేకరించిన వైద్యులు మధ్యాహ్నం 1.44 గంటలకు ప్రత్యేక అంబులెన్స్​లో​ బయలుదేరారు. గ్రీన్​ఛానల్​ ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ట్రాఫిక్​ అంతరాయం లేకుండా.. పంజాగుట్ట నిమ్స్​కు 1.56కు చేరుకున్నారు. కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్​ చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న... నిమ్స్ సీనియర్ ట్రాన్స్​ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమరేశ్​ ఆధ్వర్యంలోని బృందం.. గుండెను 5 గంటల పాటు శ్రమించి పెయింటర్​కి అమర్చారు. ఆపరేషన్​ అనంతరం పెయింటర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మానవత్వానికి ప్రతీక..

గుండెను మలక్​పేట నుంచి నిమ్స్​కి తరలిస్తున్నారని తెలుసుకున్న పలువురు మలక్​పేటకు చేరుకుని... ట్రాన్స్​ప్లాంట్ సర్జరీ దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. అంత బాధలో ఉన్న కానిస్టేబుల్​ కుటుంబం సైతం ఆ పెయింటర్ ముఖంలో విరబూసే చిరునవ్వులో తమ వీరబాబును చూసుకుంటామని చెప్పటం.. మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించగా.. మొదటి సారి బయటి ఆస్పత్రి నుంచి నిమ్స్​కు గుండెను తరలించారు. మరోవైపు జీవన్​దాన్​లో నమోదు చేసుకున్న ఒక్క రోజులోనే హృదయం లభించటం చాలా అరుదైన విషయమని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:


 

Last Updated : Sep 15, 2021, 10:48 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details