హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో హరితహారం ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నెలాఖరుకల్లా ఈ దఫా హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో కార్యక్రమాలను అమలు చేస్తూ... లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, పచ్చదనం పెరగడం వల్ల అందరూ హర్షిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాదికి నిర్ధేశించిన 29.86 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 65 శాతంతో 19.58 కోట్లు మొక్కలు నాటినట్లు తెలిపారు.
జియోట్యాగింగ్ తప్పనిసరి...
నాటే ప్రతి మొక్క ఎదిగేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, కచ్చితంగా జియోట్యాగింగ్ పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ళకు గాను క్యాలెండర్ ఇయర్ ప్లాన్‌ను రూపొందించుకుని, నర్సరీల్లో ఎత్తైన మొక్కలను పెంచాలని సూచించారు. సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రకృతి వనాల ఏర్పాటును సవాల్‌గా తీసుకుని అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు.