Harish Rao on Infection Prevention Training: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం మూడంచెల విధానంతో ముందుకు సాగుతున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం ఆ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌లను నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ 7 శాతం ఉంటే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 10శాతంగా ఉందని వెల్లడించారు.
వైద్యసేవల విషయంలో రోగులను సంతృప్తిపర్చటమే అంతిమంగా వైద్యసిబ్బంది లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా... రాష్ట్రంలోని 30 టీచింగ్ ఆస్పత్రులు వైద్యులు, నర్సులకు నిమ్స్‌లో రెండ్రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు... వైద్యులకు, స్టాఫ్ నర్సులకు ఇన్‌ఫెక్షన్ కంట్రోల్, వైద్యసేవల పట్ల వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే పేద ప్రజలు సంతృప్తిపడేలా వైద్యసేవలు అందించడంతోనే అద్భుతమైన తృప్తి లభిస్తుందని మంత్రి తెలిపారు.
'అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ రేటు 7శాతం లోపే. ప్రతి ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేశాం. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువ. వైద్య రంగంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి రెండేళ్లకోసారి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించాం. ప్రసూతి విభాగం, డయాలసిస్ వార్డుల్లో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆస్పత్రుల్లో రూ.30 కోట్లతో మార్చురీల ఆధునికీకరణ చేపట్టాం. 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ మిషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. గర్భిణులు ఒక్క స్కాన్ కోసం కూడా బయటకు వెళ్లాల్సిన పని ఉండదు.'- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో కొలువుల భర్తీపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టతనిచ్చారు. వైద్య కళాశాలల్లో వెయ్యి 140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరో రెండ్రోజుల్లో నోటిఫికేషన్ జారీయేనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతను తీర్చేందుకు మరో 10 రోజుల్లో వెయ్యి మంది డాక్టర్లను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ 'ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్' కార్యక్రమంలో నిమ్స్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ రామ్మూర్తి, సూపరింటెండెంట్ సత్యనారాయణ, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామహంతి, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌తో పాటు 30 టీచింగ్ ఆస్పత్రుల వైద్యులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.
మూడంచెల విధానంతో రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌కు చర్యలు: హరీశ్ రావు ఇవీ చదవండి: