నాంపల్లి నియోజకవర్గంలోని ఇంద్రానగర్ బస్తీల్లో ఎస్సీ కమిషన్ రాములు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్తోపాటు, నాంపల్లి భాజపా ఇంఛార్జ్ దేవర కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ... లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు కోరారు. ప్రజలందరి సహకారం ఉంటేనే కరోనా మహమ్మారిని జయించవచ్చునని పేర్కొన్నారు.
మారేడ్ పల్లి, లక్ష్మీనగర్‌లలో..
కాంగ్రెస్ నేత విజయరామరాజు ఆధ్వర్యంలో మారేడ్‌పల్లి, లక్ష్మీనగర్‌లోని పేదలకు ఒక్కో ఇంటికి రెండు కిలోల బియ్యం, కిలో పప్పు, టమాటాలు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలు ఎంతో క్రమశిక్షణతో కర్ఫ్యూలో పాల్గొంటున్నారని తెలిపారు. చాలా మంది ప్రజలు తినడానికి తిండి లేక, డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత తొందరగా ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పేదలందరికి బియ్యం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చైతన్యపురి కార్పోరేటర్ ఆధ్వర్యంలో..
జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు, దినసరి కూలీలకు చైతన్యపురి కార్పోరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి నిత్యావసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. డివిజన్ పరిధిలోని కూలీలకు బియ్యం, పప్పు, నూనెను 300మందికి పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.