తెలంగాణ

telangana

ETV Bharat / city

Varuna reddy: వరుణారెడ్డిపై ఏపీ సర్కార్ అంతులేని ప్రేమ... - తెలంగాణ వార్తలు

Varuna reddy: తెదేపా నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను అనంతపురం జైల్లో హత్యకు గురైన వ్యవహారంలో శాఖాపరమైన శిక్షకు గురయిన జైళ్ల శాఖ అదనపు సూపరింటెండెంట్‌ పోచా వరుణారెడ్డిపై వైకాపా ప్రభుత్వం తొలి నుంచీ అంతులేని ప్రేమ కనబరిచింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, పర్యవేక్షణ లేమి, భద్రతాపరమైన అంశాలు పట్టించుకోకపోవటం తదితర వైఫల్యాల వల్లే మొద్దు శీను హత్య చోటుచేసుకుందంటూ ఉమ్మడి ఏపీలో వరుణారెడ్డిపై విధించిన పనిష్మెంట్‌ ఆదేశాలన్నింటినీ కొట్టేసింది.

Varuna
Varuna

By

Published : Feb 13, 2022, 9:34 AM IST

Varuna reddy: తెదేపా నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను అనంతపురం జైల్లో హత్యకు గురైన వ్యవహారంలో శాఖాపరమైన శిక్షకు గురయిన జైళ్ల శాఖ అదనపు సూపరింటెండెంట్‌ పోచా వరుణారెడ్డిపై వైకాపా ప్రభుత్వం తొలి నుంచీ అంతులేని ప్రేమ కనబరిచింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, పర్యవేక్షణ లేమి, భద్రతాపరమైన అంశాలు పట్టించుకోకపోవటం తదితర వైఫల్యాల వల్లే మొద్దు శీను హత్య చోటుచేసుకుందంటూ ఉమ్మడి ఏపీలో వరుణారెడ్డిపై విధించిన పనిష్మెంట్‌ ఆదేశాలన్నింటినీ కొట్టేసింది. అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే (2019 ఆగస్టు 29న) ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. తాజాగా అదే అధికారిని.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌ రిమాండ్‌లో ఉన్న కడప కేంద్ర కారాగారం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నియమించిన నేపథ్యంలో పాత అంశాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

అభియోగాలు నిరూపణవటంతో..

2008 నవంబరు 9న అనంతపురం జిల్లా కారాగారంలో మొద్దు శీనును ఓం ప్రకాశ్‌ అనే మరో ఖైదీ డంబెల్‌తో మోది హతమార్చారు. ఆ రోజు జైలు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వల్లే మొద్దు శీను హత్య చోటుచేసుకుందంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అభియోగాలు మోపింది. ‘డంబెల్‌ వంటివి ఖైదీల వద్ద ఉన్నాయని గుర్తించటంలోనూ, భద్రతాపరమైన అంశాల అమలు, పర్యవేక్షణలోనూ వరుణారెడ్డి విఫలమయ్యారు. ఖైదీల కదలికలపై ఆయనకు పర్యవేక్షణ లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఓం ప్రకాశ్‌ను మొద్దు శీను ఉన్న బ్యారెక్‌లోకి తరలించారు. బ్యారెక్‌ల వారీగా ఖైదీల వివరాలు కూడా తీసుకులేదు. ఇవన్నీ దుష్ప్రవర్తన కిందకే వస్తాయి’ అని అభియోగాల్లో పేర్కొంది.

ఇంక్రిమెంట్లు వాయిదా వేస్తూ ఆదేశాలు

ఆయా అభియోగాలపై సమగ్ర విచారణ జరిపిన అప్పటి జైళ్ల శాఖ డీజీ... వరుణారెడ్డికి భవిష్యత్తు ఇంక్రిమెంట్లు, పింఛన్‌పై ప్రభావం పడేలా రెండేళ్ల పాటు ఇంక్రిమెంట్లు వాయిదా వేశారు. ఆయన సస్పెన్షన్‌ కాలాన్ని విధుల్లో లేని సమయంగా పరిగణిస్తూ పనిష్మెంట్‌ ఇచ్చారు. ఆ ఆదేశాల్ని పరిశీలించాలంటూ ఆయన చేసుకున్న వినతిని కూడా తిరస్కరించారు. కొన్నాళ్ల తర్వాత ఆయనకు విధించిన పనిష్మెంట్‌ను కొద్దిగా సవరిస్తూ 2013 ఫిబ్రవరి 8న హోంశాఖ ఆదేశాలిచ్చింది. క్యుమిలేటివ్‌ ప్రభావం లేకుండా ఏడాదిపాటు ఆయన వార్షిక గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేసింది.

అంతకు ముందూ ఆరోపణలు..

వరుణారెడ్డి మదనపల్లె సబ్‌ జైలు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఎస్‌.వెంకటరమణ అనే వ్యక్తిని కొన్ని నెలల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారంటూ ఆరోపణలున్నాయి. వరుణారెడ్డిపై అభియోగాలు నిరూపణ కాలేదని విచారణ అధికారి తేల్చారు. అప్పటి జైళ్ల శాఖ డీజీ విచారణ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసి, ఆమోదించలేదు. ఆయన ఇంక్రిమెంట్‌ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ పనిష్మెంట్‌ ఇచ్చారు. 2011లో ప్రభుత్వం ఆ ఆదేశాలను కొట్టేసింది.

పనిష్మెంట్లు రద్దు.. సస్పెన్షన్‌ కాలమూ పరిగణనలోకి

తనకు విధించిన పనిష్మెంట్‌ను సానుభూతితో, మానవీయ కోణంలో కొట్టేయాలని కోరుతూ 2019 ఫిబ్రవరి 4న వరుణారెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 2019 మే 30న అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ఆ తర్వాత మూణ్నెలల్లోనే వాటిని కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2008 నవంబరు 10 నుంచి 2010 ఫిబ్రవరి 7 వరకూ ఆయన సస్పెన్షన్‌లో ఉన్న కాలాన్ని కూడా డ్యూటీలోనే ఉన్నట్లు పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2019 ఆగస్టు 29న హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చూడండి :Pollution: నిబంధనలకు నీళ్లొదలిన ఫార్మా కంపెనీలు.. కాలుష్య కోరల్లో పల్లెలు

ABOUT THE AUTHOR

...view details