హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తేదీతో ముగియనుంది. ఆలోగా జీహెచ్ఎంసీకి కొత్త పాలకమండలిని ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వపరంగా గ్రేటర్ ఎన్నికల దిశగా అవసరమైన అడుగులు వేస్తున్నారు. జీహెచ్ఎంసీ సంబంధిత అంశాలపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
పూర్తి పారదర్శకంగా పాలన...
రాష్ట్రంలో స్థానికసంస్థల పరిపాలన పూర్తి పారదర్శకంగా జరిగేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. అధికారాలు, నిధులు ఇస్తూనే... విధులు, బాధ్యతలను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు. పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పదిశాతం హరిత బడ్జెట్, నాటిన మొక్కల్లో 85శాతం బతికి లేకుంటే బాధ్యులపై చర్యలు, వందశాతం పన్నుల వసూలు, ఇతరత్రా అంశాలను పొందుపరిచారు. పౌరులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించేలా నిబంధనలు చేర్చారు. చెత్త వేసినా, చెట్టు నరికినా జరిమానాలు విధించవచ్చు. వీటన్నింటి ఫలితాలు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.