హైదరాబాద్ రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ (GHMC) చర్యలు తీసుకుంటోంది. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం (Sai Dharam Tej road accident) నేపథ్యంలో రోడ్లపై వ్యర్థాలు వేసే వారికి జరిమానాలు విధిస్తోంది. నగరంలోని మాదాపూర్ ఖానామెట్‌లో అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి బల్దియా లక్ష రూపాయల జరిమానా విధించింది. భవన నిర్మాణాల సమయంలో రోడ్లపైకి చెత్త, ఇసుక, ఇతర వ్యర్థాలు రాకుండా సంబంధిత నిర్మాణదారులు చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. లక్ష రూపాయల జరిమానా చలాన్‌ను కంపెనీ ప్రతినిధులకు జీహెచ్ఎంసీ చందానగర సర్కిల్ అధికారులు అందించారు.
రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల
సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధిలో శుక్రవారం రాత్రి సాయిధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది (Sai Dharam Tej road accident). కేబుల్ బ్రిడ్జి(Hyderabad Cable bridge) వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయారు. ప్రమాదంలో ఆయన కుడి కంటి పైభాగం, ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాపూర్ ఏసీపీ ఈ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని.. దాని వల్ల తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
సంబంధిత కథనం :హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి అదే కారణం: మాదాపుర్ డీసీపీ