తెలంగాణ

telangana

ETV Bharat / city

కష్టపడి పనిచేయండి.. భాజపా కార్పొరేటర్లకు మోదీ ఉద్బోధ

Modi meeting with corporators: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రాజకీయాంశాల జోలికి పోవడం కన్నా పార్టీ కోసం పనిచేయాల్సిన విధానం, పనిచేసేవారికి లభించే గుర్తింపు గురించే మోదీ ఎక్కువగా మాట్లాడినట్లు సమాచారం. తెరాస ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో సులభంగా గెలుస్తామని కొందరు కార్పొరేటర్లు అన్నప్పుడు.. వ్యతిరేకత అంటే ఏంటని ప్రధాని ప్రశ్నించినట్లు తెలిసింది. అందుకు కారణం.. కుటుంబ పాలనా? అధికార దుర్వినియోగమా? ఇంకా ఏదైనానా? అని అడిగినట్లు తెలుస్తోంది.

ghmc-corporators-meets-pm-modi
కష్టపడి పనిచేయండి.. భాజపా కార్పొరేటర్లకు మోదీ సూచన

By

Published : Jun 8, 2022, 4:03 AM IST

Modi GHMC corporators Meeting: "ప్రజలు మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. ఇంత మంది గెలవడం చిన్న విషయమేమీ కాదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. వివాదాస్పద అంశాలు, ప్రతికూల విషయాలను పక్కనపెట్టి సానుకూల దృక్పథంతో పనిచేసుకుపోవాలి. తద్వారా మీకు, పార్టీకి పేరు వస్తుంది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది. కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఓపిగ్గా, నిజాయతీగా.. నిష్ఠతో పనిచేసినప్పుడే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేటర్‌ స్థాయి నుంచి కేంద్ర మంత్రుల స్థాయికి ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారు.వారిని ఆదర్శంగా తీసుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి" అని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. మంగళవారం దిల్లీలోని 7-లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 46 మంది కార్పొరేటర్లు సహా మొత్తం 76 మంది నాయకులతో ప్రధాని సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారు. వారి యోగక్షేమాలు, అనుభవాలు, రాష్ట్ర స్థితిగతులు తెలుసుకుంటూనే.. భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు.

ఈ భేటీలో రాజకీయాంశాల జోలికి పోవడం కన్నా పార్టీ కోసం పనిచేయాల్సిన విధానం, పనిచేసేవారికి లభించే గుర్తింపు గురించే మోదీ ఎక్కువగా మాట్లాడినట్లు సమాచారం. తెరాస ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో సులభంగా గెలుస్తామని కొందరు కార్పొరేటర్లు అన్నప్పుడు.. వ్యతిరేకత అంటే ఏంటని ప్రధాని ప్రశ్నించినట్లు తెలిసింది. అందుకు కారణం.. కుటుంబ పాలనా? అధికార దుర్వినియోగమా? ఇంకా ఏదైనానా? అని అడిగినట్లు సమాచారం. మాజీ ప్రజాప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. కేసీఆర్‌ కుటుంబ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎన్నికల్లో సులభంగా గెలిచేస్తామని ఎప్పుడూ ఉదాసీనంగా వ్యవహరించకూడదని.. ప్రతి అంశాన్నీ లోతుగా అధ్యయనం చేసి, దాని మూలాల్లోకి వెళ్లి విశ్లేషించి ముందడుగు వేయాలని మోదీ సూచించినట్లు తెలిసింది. కష్టపడి పనిచేసి బలం పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి తప్ప.. ఇతరుల బలహీనతలపై ఆధారపడకూడదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. బిల్డర్లు, భూకబ్జాదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్పొరేటర్లుగా గెలిచిన ఏడాదిన్నరలో అనుభవాలు ఏంటని అడిగినప్పుడు కొందరు సభ్యులు మాట్లాడినట్లు తెలిసింది.

అనంతరం మోదీ స్పందిస్తూ.. తెలంగాణలో పార్టీకి మంచి వాతావరణం ఉందని, సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషిచేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు చెప్పాలని, లబ్ధిదారులందరికీ చేరేలా చూడాలని సూచించారని సమావేశంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అందర్నీ పరిచయం చేశారు. అక్కడ సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు, మంత్రులకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని.. ఇక్కడ కార్పొరేటర్లు నేరుగా ప్రధానిని కలిసే అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని కార్పొరేటర్లతో పాటు ఓ మాజీ ప్రజాప్రతినిధి చెప్పారు. ప్రధాని పిలిచి మాట్లాడటం తమకెంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, జీవితాంతం గుర్తుండిపోతుందని సమావేశం అనంతరం కొందరు మహిళా కార్పొరేటర్లు సంతోషం వ్యక్తంచేశారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటికొచ్చి పనిచేయాలని, ప్రజలకు అండగా ఉండాలని మోదీ చెప్పారని వారు తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఒక్కసారి కూడా కార్పొరేషన్‌ సమావేశాలకు వచ్చి ప్రజల సమస్యలను వినలేదని, ప్రధాని దిల్లీకి పిలిపించుకొని మాట్లాడటం ఆయన గొప్పతనాన్ని చాటుతోందని పేర్కొన్నారు. సమావేశం వివరాలను బయటికి వెల్లడించవద్దని చెప్పడంతో ముఖ్యనేతలెవరూ మీడియాతో అధికారికంగా మాట్లాడలేదు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, మధ్యప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, కూన శ్రీశైలంగౌడ్‌, టి.నందీశ్వర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మధ్యాహ్నం కిషన్‌రెడ్డి నివాసంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీతోనూ కార్పొరేటర్లు, నేతలు సమావేశమయ్యారు.

కుటుంబ దుష్పరిపాలనకు ముగింపు పలుకుతాం: ప్రధాని ట్వీట్‌
తెలంగాణలో కుటుంబ దుష్పరిపాలనకు ముగింపు పలికి సుపరిపాలనకు భాజపా కృషి చేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన వారితో కలిసి దిగిన ఫొటోలను జత చేస్తూ ట్వీట్‌ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చేలా సాగింది. ‘‘నేను జీహెచ్‌ఎంసీలోని కార్పొరేటర్లు, తెలంగాణలోని పార్టీ నాయకులను కలిశాను. సామాజిక సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం, అట్టడుగువర్గాల ప్రజలకు ఎలా సాయపడాలన్న అంశాలపై విస్తృతంగా చర్చించాం. తెలంగాణలో కుటుంబ దుష్పరిపాలనకు ముగింపు పలికి, సుపరిపాలన కోసం భాజపా పనిచేస్తుంది’’ అని ఆయన భవిష్యత్తులో పార్టీ అనుసరించబోయే పంథా గురించి చెప్పారు.

ఇదీ చదవండి:నిందితులను వదిలిపెట్టి.. పోరాడే వారిపైనే కేసులా?: రాజాసింగ్

ABOUT THE AUTHOR

...view details