తెలంగాణ

telangana

ETV Bharat / city

Ganesh Immersion: హుస్సేన్​సాగర్​కు గణనాథులు.. నిమజ్జనానికి ఏర్పాట్లు - మట్టి గణేశుల నిమజ్జనం

పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై స్పష్టత రాకముందే.. మట్టి గణపతులు ఇప్పటికే గంగమ్మ బాట పట్టారు. మట్టి విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ఇవ్వటం వల్ల.. ఇప్పటికే చాలా గణేశులు హుస్సేన్​సాగర్​కు చేరుకుంటున్నారు. నిమజ్జనానికి క్రేన్లతో పాటు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు క్లీనింగ్​ మిషన్​లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.

Ganesh Immersion started in Hussain sagar and cleaning of wastage
Ganesh Immersion started in Hussain sagar and cleaning of wastage

By

Published : Sep 15, 2021, 12:37 PM IST

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌(పీవోపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో అధికారులు మట్టి ప్రతిమలు గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలో అధికారిక, అనధికారిక లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే పదివేల మట్టి విగ్రహాలకు పూజలు చేస్తున్నారని తెలిసింది. వీటిని సాగర్‌, చెరువుల్లో నిమజ్జనం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌ పరిధిలోని నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజా దగ్గర ఐదు క్రేన్లు ఏర్పాట్లు చేశారు. ఇదే తరహాలో చెరువుల దగ్గరా తగిన సదుపాయాలు కల్పించారు.

సాగర్​లో ఓ పక్క మట్టి గణేశుల నిమజ్జనం కొనసాగుతుండగా... మరో పక్క క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నెక్లెస్​రోడ్డులో రెండు కొలునులు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు... పీపుల్ ప్లాజా వద్ద మూడు క్రైన్లు ఏర్పాటు చేశారు. మరో పక్క మూడు క్లీనింగ్ మిషన్​ల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తతో పాటు వినాయక విగ్రహాలను బయటకు తీస్తున్నారు.

ప్రత్యామ్నాయాల పరిశీలన..

గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పీవోపీ ప్రతిమలు సాగర్‌, చెరువుల్లో వేయొద్దంటూ హైకోర్టు ఆదేశాల ఇచ్చిన నేపథ్యంలో అంతకుముందు మొదలుపెట్టిన ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. మహానగరంలో చిన్నా పెద్దా కలిపి లక్షన్నర విగ్రహాలుంటాయని చెబుతున్నారు. వీటన్నింటిని కోనేరుల్లో నిమజ్జనం చేయాలంటే ఆరు రోజులు పడుతుందని అంచనా వేశారు. సాగర్‌కు అనుమతించకపోతే ఈ నెల 19న నగర వ్యాప్తంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం రాత్రి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో బల్దియా కమిషనర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

బుధవారం ఇది విచారణకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జన ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తే ఏమిచేయాలన్న దానిపై కూడా ప్రత్యామ్నాయ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు. భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పీవోపీ ప్రతిమలతో సాగర్‌తోపాటు చెరువుల దగ్గరకు వస్తే ఏమి చేయాలన్న దానిపై కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఇతర పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు పదో రోజు నిమజ్జనం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అనేకమంది మూడో రోజు నుంచే ప్రతిమలను కొలనుల వద్దకు తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details