ganesh immersion in telangana 2022: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. భక్తుల కోలాహలాల మధ్య వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. శోభాయాత్ర మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు అంతటా సందడి వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల వర్షాలు కురిసినప్పటికీ.. భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
హైదరాబాద్‌లో గణేశుని శోభయాత్ర వైభవం:హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర వైభవంగా ముగిసింది. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం కోసం వేలాది వినాయక విగ్రహాలు తరలివచ్చాయి. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎప్పటికప్పుడు యాత్ర సాగుతున్న తీరును పరిశీస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.
వరంగల్‌లో వినాయక నిమజ్జనాలు:వరంగల్‌లో వినాయక నిమజ్జనం కొలాహలంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా చెరువుల వద్ద నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. డప్పుల వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు చోట్ల వర్షంలోనే గణనాథులను నిమజ్జనం చేశారు.